గురువారం 01 అక్టోబర్ 2020
Rangareddy - Aug 11, 2020 , 23:33:48

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

దుండిగల్‌ : కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్‌జిల్లా కొల్చారం మండలానికి చెందిన సిద్దిరాములు కొడుకు నవీన్‌(21) సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అన్నారం గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అదే మండలంలోని ఖాజిపల్లిలోని ఓ ఫార్మా పరిశ్రమలో కూలీగా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయంలో స్నేహితులతో జూలాయిగా తిరిగే అలవాటున్న నవీన్‌ను వైఖరి మార్చుకోవాలని కుటుంబ సభ్యులు తరచూ హెచ్చరించేవారు. ఈ విషయమై కుటుంబ సభ్యులతో పలుమార్లు గొడవలు జరిగాయి. సోమవారం సైతం గొడవ జరుగడంతో మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన నవీన్‌.. రాత్రివరకు ఇంటికి వెళ్లలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధి గాగిళ్లాపూర్‌లోని ఎస్‌ఎంఎస్‌ పరిశ్రమ వెనుక ప్రాంతంలో మంగళవారం ఉదయం చెట్టుకు ఓ యువకుడు ఉరేసుకున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్‌ చేశారు. మృతుడి ప్యాంటు జేబులో లభించిన ఆధారాలతో నవీన్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి బావ మురళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.


logo