శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 28, 2020 , 23:20:05

తుపాకీ కాల్పుల కలకలం..

తుపాకీ కాల్పుల కలకలం..

వినాయక నిమజ్జనం సందర్భంగా.. యువకుల హంగామా

వారించడానికి మాజీ ఆర్మీజవాన్‌ కాల్పులు 

అరెస్ట్‌ చేసిన పోలీసులు

మణికొండ : నగర శివారులో తుపాకీ కాల్పులు కలకలం రేపింది. వినాయక నిమజ్జనం సందర్భంగా కొంతమంది మద్యం తాగి గొడవ చేస్తుండటంతో.. వారిని వారించడానికి ఓ మాజీ ఆర్మీ జవాన్‌ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. హైదర్షాకోట్‌, లక్ష్మీనగర్‌ కాలనీలోని వినాయక నిమజ్జన వేడుకలు గురువారం రాత్రి వరకు జరిగాయి. కాగా.. నిమజ్జనం అనంతరం కొంతమంది యువకులు అదే కాలనీలోని ఓ అపార్టుమెంట్‌ మొదటి అంతస్తులో మద్యం తాగుతూ.. లిఫ్ట్‌తోపాటు అక్కడక్కడా తిరుగుతూ గట్టిగా అరుస్తూ హంగామా చేశారు. మరికొంత మంది మెట్లపై, టెర్రస్‌పై మద్యం తాగుతూ గట్టిగా అరుస్తున్నారు. గమనించిన.. మూడో అంతస్తులో ఉండే రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి నాగమల్లేశ్‌ అక్కడకు వచ్చి అల్లర్లు చేయకుండా ఉండాలని, పలుమార్లు చెప్పినా యువకులు విన్పించుకోకుండా అలాగే చేశారు. దీంతో నాగమల్లేశ్‌..  తనవద్ద ఉన్న తుపాకీతో బెదిరించే ప్రయత్నం చేశాడు. అయినా .. మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు పట్టించుకోలేదు. ఆవేశంతో మల్లేశ్‌.. తుపాకీతో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో మద్యం మత్తులో కొందరు యువకులు అక్కడ నుంచి పారిపోగా.. మరికొంతమంది నాగమల్లేశ్‌తో వాదనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి అకారణంగా లైసెన్సు తుపాకీతో కాల్పులు జరిపిన నాగమల్లేశ్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే అల్లర్లకు పాల్పడిన కొంతమంది యువకులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.