ఆదివారం 25 అక్టోబర్ 2020
Rangareddy - Sep 22, 2020 , 01:05:53

సంక్షేమ పథకాల పుట్టినిల్లు తెలంగాణ

సంక్షేమ పథకాల పుట్టినిల్లు తెలంగాణ

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

షాద్‌నగర్‌లో పర్యటన 

టీఆర్‌ఎస్‌ శ్రేణులతో సమావేశం

షాద్‌నగర్‌/షాద్‌నగర్‌రూరల్‌: : సంక్షేమ పథకాల పుట్టినిల్లు తెలంగాణ అని, కరోనా కాలంలో దేశ ఆర్థికవ్యవస్థ ఆగమైనా రాష్ట్రంలో ప్రజాసంక్షేమం ఆగలేదని రాష్ట్ర క్రీడల, ఎక్సైజ్‌, సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. షాద్‌నగర్‌ పట్టణంలో నిర్మించిన మినీ స్టేడియం, మైదాన స్థలాన్ని సోమవారం  ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో కరోనా తాండవిస్తున్నా రైతుల ఇండ్ల వద్దకు, కల్లాల వద్దకు వెళ్లి పంటలను కొనుగోలుచేసిన ఘనత దేశంలోనే మన రాష్ర్టానికే దక్కిందన్నారు. నేడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి మన రాష్ట్రం ఎదుగడం సీఎం కేసీఆర్‌ పాలనకు నిదర్శనమని కొనియాడారు.  ఈ ప్రాంత రైతాంగానికి కృష్ణా, గోదావరి జలాలను సాగు నీరుగా అందించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని అన్నారు. షాద్‌నగర్‌ పట్టణంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఈకో పార్కును నిర్మిస్తామని, త్వరలోనే నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో క్రీడా మైదానాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని వివరించారు.  షాద్‌నగర్‌ మైదానాన్ని అభివృద్ధి చేసేందుకు స్థానికంగా ఉన్న వ్యాపారులు, పరిశ్రమల నిర్వాహకులు, ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులు సహకారాలు అందించాలని కోరారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ అనిత, స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో ప్రతి మనిషికి శారీరక శ్రమ అవసరమని, ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాయామంపై దృష్టిసారించాలని కోరారు. పట్టణవాసులు మైదానాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  నూతన క్రీడా మైదానంలో మంత్రి, ఎమ్మెల్యేలు షటిల్‌ క్రీడలను ఆడారు. పట్టణంలోని నాగులపల్లిరోడ్డులో అంతర్గత మురుగు కాలువ నిర్మాణ పనులను ప్రారంభించారు. నూతనంగా అభివృద్ధి చేసిన శ్మశానవాటిక నిర్మాణ పనులను పరిశీలించారు. పలువురు స్థానిక నాయకులు, క్రీడాకారులు మంత్రి, ఎమ్మెల్యేలను సత్కరించారు.

పట్టభద్రులు ఓటుహక్కును వినియోగించుకోవాలి..

పట్టభద్రులు ఓట హక్కును  సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీ ఈడెన్‌ ప్లాజాలో సోమవారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అఖండ విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు  పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో డిగ్రీ ఉత్తీర్ణలైన వారిని ఇన్‌చార్జిలుగా నియమించాలన్నారు. ఇన్‌చార్జులు గడపగడపకూ వెళ్లి 2017వ సంవత్సరం నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన వారిని గుర్తించి అన్‌లైన్‌లో లేదా మండల కార్యాలయంలో ఓటు నమోదు చేయించాలన్నారు.  ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజు, ఎంపీపీలు ఖాజాఇద్రీస్‌, రవీందర్‌యాదవ్‌,  మధుసూదన్‌రెడ్డి, ప్రియాంక శివశంకర్‌గౌడ్‌, జడ్పీటీసీ పి.వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, లక్ష్మీనర్సింహారెడ్డి, మండల అధ్యక్షురాలు శోభలక్ష్మణ్‌ నాయక్‌, మండల యూత్‌ అధ్యక్షుడు రవీందర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అంతర్గత రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

కొత్తూరు: గ్రామాల్లో అంతర్గత రోడ్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నందిగామ గ్రామంలో సోమవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ రూ.29 లక్షల విలువ చేసే మూడు సీసీ రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. 

గ్రామాల్లోని అన్ని బస్తీల్లో సీసీ రోడ్లు నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తుమన్నామని వివరించారు.  ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ మాట్లాడుతూ షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నాణ్యమైన రోడ్లను నిర్మించడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి, ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు  గ్రామంలో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఈట గణేశ్‌, నందిగామ  ఎంపీపీ ప్రియాంక శివశంకర్‌గౌడ్‌, నందిగామ సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు చంద్రపాల్‌రెడ్డి, కొమ్ముకృష్ణ, కుమారస్వామిగౌడ్‌, ఉప సర్పంచ్‌ ఎం కుమార్‌ పాల్గొన్నారు.

 బీమాతో రైతు కుటుంబాలకు ధీమా..

రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు ధీమా ఇస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. సోమవారం నందిగామ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతి చెందిన ముగ్గురు రైతుల కుటుంబాలకు ఎమ్మెల్యే రైతు బీమా చెక్కులు అందించారు. 

మహిళలకు ధ్రువీకరణపత్రాలు అందజేత 

ఎన్‌వైకే రంగారెడ్డి జిల్లా సహకారంతో గణేశ్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ద్వారా శిక్షణ పొందిన మహిళలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధ్రువీకరణపత్రాలు అందజేశారు.  శిక్షణ పొందిన 30మంది మహిళలకు అందజేశారు.                     శిక్షకురాలు పద్మ, యువజన సభ్యులు పాల్గొన్నారు. 

హెచ్‌బీఎల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నందిగామ పర్యటనకు వెళ్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హెచ్‌బీఎల్‌ కార్మికులు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. తమకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదని కార్మికులు మంత్రి ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.   logo