బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Sep 16, 2020 , 01:13:44

ఇతర దేశాలతో తెలంగాణ పోటీ పడుతోంది

ఇతర దేశాలతో తెలంగాణ పోటీ పడుతోంది

బండ్లగూడ, సెప్టెంబర్‌ 15: ఇతర దేశాలతో తెలంగాణ పోటీ పడవచ్చని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఎర్రకుంట వద్ద మన టాయిలెట్లను రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, మేయర్‌ మహేందర్‌గౌడ్‌, డిప్యూటీ మేయర్‌ పూలపల్లి రాజేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేంకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో ప్రజలు ఎక్కడా కూడా బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదన్న లక్ష్యంతో అన్ని మున్సిపాలిటీల్లో నూతనంగా టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్‌ అనేక నూతన పద్ధతులను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా టీఆర్‌ఎస్‌ ప్రభత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నదన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి నిధులను మంజురు చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు తలారి చంద్రశేఖర్‌, రవీందర్‌రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యులు మాలాకీ రత్నం, వెంకట్‌రెడ్డి, జగదీశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నాగరాజు, రాందాస్‌, పాపయ్యయాదవ్‌, సురేశ్‌గౌడ్‌, పాండు, ప్రేమ్‌గౌడ్‌, సంగీతం దశరత్‌, వెంకటేశ్‌, రజాక్‌, తదితరులు పాల్గొన్నారు.

పరిశీలించిన కలెక్టర్‌

బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మన టాయిలెట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ పరిశీలించారు. అనంతరం కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.