మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Aug 29, 2020 , 23:25:23

అనుమానంతోనే.. భార్యను హతమార్చాడు

అనుమానంతోనే.. భార్యను హతమార్చాడు

దుండిగల్‌: ఈ నెల 23న సూరారం కాలనీలో జరిగిన వివాహిత హత్య కేసు మిస్టరీని దుండిగల్‌ పోలీసులు ఛేదించారు. పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ, సీఐ వెంకటేశంతో కలిసి వివరాలు వెల్లడించారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన విశ్వనాథ్‌, పూల్‌బాయి దంపతులు సూరారం కాలనీ, సాయిబాబానగర్‌లోని పాండుబస్తీలో ఉంటున్నారు. వీరి కూతురు కాశీబాయి(20)ని మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన మాధవ్‌లక్ష్మణ్‌ సూర్యవంశీ(26)కు ఇచ్చి వివాహం చేశారు. వివాహం అనంతరం దంపతులు మహారాష్ట్రలోని పుణేలో ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కాశీబాయి భర్తతో కలిసి సూరారంలోని తల్లిగారింటికి వచ్చింది. మూడు నెలల క్రితం భార్యను ఇక్కడే వదిలి మాధవ్‌.. వారి ఊరికి వెళ్లాడు. భార్యకు ఎప్పుడు ఫోన్‌ చేసినా బిజీగా వస్తుండేది. దీంతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. వెంటనే ఈ నెల 22న అత్తగారింటికి వచ్చాడు. 23న అత్తమామలు బయటకు వెళ్లగా.. మాధవ్‌ మధ్యాహ్నం బయటకు వెళ్లి మద్యం తాగి వచ్చాడు. ఆ సమయంలో భార్య మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆమెతో గొడవపడ్డాడు. కోపంతో కూరగాయలు కోసే కత్తితో భార్య గొంతు కోసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.కాగా, శనివారం తెల్లవారు జామున సిద్దిపేటకు వెళ్లేందుకు  సికింద్రాబాద్‌ జేబీఎస్‌ బస్‌స్టాప్‌ వద్ద  అనుమానాస్పదంగా ఉన్న మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్య విషయం బయటపడింది.