బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Sep 23, 2020 , 00:57:01

కబ్జా చేస్తే కఠిన చర్యలు

కబ్జా చేస్తే కఠిన చర్యలు

శిఖం పట్టాలో నిర్మాణం చేపట్టిన సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేస్తాం

తాసిల్దార్‌ అనిత

మొయినాబాద్‌ : నాలాలు, చెరువులు కబ్జా చేస్తే ఎవరినీ ఉపేక్షించేదిలేదని.. సదరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తాసిల్దార్‌ అనిత అన్నారు. చిన్నమంగళారం చిన్న చెరువులోని శిఖం పట్టాలో నగరానికి చెందిన భూమిని కొనుగోలు చేసి ప్రహరీ నిర్మించడంతోపాటు చెరువులోకి వచ్చే వరద కాలువను కూడా కబ్జా చేసి ప్రహరీ నిర్మించి కాలువను మూసివేశారని ఎంపీటీసీ మల్లేశ్‌ సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్‌ అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని చిన్న చెరువును సందర్శించగా భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ప్రహరీ నిర్మించడానికి బేస్మిట్‌ నిర్మాణం చేపట్టారని, చెరువులోకి వచ్చిన వరద కాలువను సైతం పక్క పొలాల వారు మూసివేసినట్లు గుర్తించారు. నాలాలను మూసివేయడంతోనే ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు కాలువల ద్వారా పోకుండా పక్కనే ఉన్న పంట పొలాలలోకి వెళ్లడంతో పంటలు నీట మునిగాయని అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా తాసిల్దార్‌ అనిత మాట్లాడుతూ చిన్న చెరువులోని భూమి శిఖం పట్టా అయినప్పటికీ అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని తేల్చిచెప్పారు. చెరువులోకి  నీళ్లు వచ్చినప్పుడు వదిలిపెట్టాలని, నీళ్లు లేని సమయంలో పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. కానీ శిఖం పట్టా కొనుగోలు చేసిన వ్యక్తి గతంలోనే ప్రహరీ నిర్మాణం కోసం బేస్మిట్‌ నిర్మించగా సదరు భూమి పట్టాదారుడికి నోటీసులు సైతం జారీ చేసినా అతడు నోటీసులు తీసుకోలేదని, భూమి వద్ద ఉన్న మరో వ్యక్తి నోటీసులు తీసుకున్నాడని ఆమె చెప్పారు. మళ్లీ సదరు పట్టాదారుడికి నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. అతడు స్పందించకపోతే శిఖం పట్టాలో నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. వరద కాలువను ఎవరూ మూసివేయకూడదని, వరదనీరు సాఫీగా వెళ్లేలా కాలువకు మరమ్మతులు చేయాలని సదరు పట్టాదారులకు సూచించారు. వరద కాలువపై ఎవరైనా కబ్జాకు పాల్పడితే సదరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఖాయమని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రోజా, ఎంపీటీసీ మల్లేశ్‌, నీటిపారుదలశాఖ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహులు, సర్వేయర్‌ శ్రీనివాస్‌, నాయకులు ఆంజనేయులుగౌడ్‌, నడిమింటి రాములు, రైతులు ఉన్నారు.