శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 16, 2020 , 23:35:58

పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

నైట్‌బజార్‌ను తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

  కొండాపూర్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకరంగాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం ఆయన మాదాపూర్‌లోని శిల్పారామానికి అనుబంధంగా ఉన్న నైట్‌ బజార్‌ను తనిఖీ చేశారు. నగరంలో అత్యంత విలువైన, పర్యాటక ప్రాంతంగా ఉన్న నైట్‌ బజార్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొంతకాలంగా న్యాయ వివాదాల వల్ల మూతపడిన నైట్‌ బజార్‌ను పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది చేనేత, హస్త కళాకారులు శిల్పారామం మంచి మార్కెట్‌ను అందిస్తున్నదని, అదే తరహాలో నైట్‌ బజార్‌ను అందరికి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు అతి చేరువలో ఉన్న శిల్పారామం, నైట్‌ బజార్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మాదాపూర్‌లోని దుర్గంచెరువును అతిత్వరలోనే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. నైట్‌ బజార్‌పై ఉన్న న్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించేలా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా శిల్పారామం అధికారులకు సూచించినట్లు తెలిపారు.