మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Sep 27, 2020 , 01:35:23

సమన్వయంతో ముందుకెళ్లాలి

సమన్వయంతో ముందుకెళ్లాలి

-ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కడ్తాల్‌ : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లి గ్రామాలను అభివృద్ధి చేసు కోవాలని ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్స్‌లో శనివారం ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశానికి వారితోపాటు జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వివిధ అంశాల సమీక్షలో భాగంగా ప్రజాప్రతినిధులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వాసుదేవ్‌పూర్‌ జీపీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఎంపిక చేసే ఉద్యోగులను మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేయాలని ఎంపీటీసీ లచ్చిరాంనాయక్‌ కోరారు.  ప్రభుత్వం గ్రామ పంచాయతీల నుంచి కరెంట్‌ బిల్లులు వసూలు చేస్తుండటంతో అభివృద్ధి పనులకు నిధులు సరిపోవడంలేదని, మిషన్‌ భగీరథ పనులు సాగడంలేదని సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, శంకర్‌, ఎంపీటీసీలు సభ దృష్టికి తీసుకురాగ, సమస్యల పరిష్కారానికి అక్టోబర్‌ 3న ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో ఎంపీటీసీల, మండల కోఆప్షన్‌ పాత్ర ఏంటి అని, అభివృద్ధి పనులను తమకు సమాచారం అందించడంలేదని వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌బాబా అధికారులను ప్రశ్నించారు. సర్పంచ్‌లు ఎంపీటీసీలతో కలిసి అభివృద్ధి పనులు పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మండలంలోని ఎన్ని వెంచర్లు ఉన్నాయి, 10 శాతం భూమిని పంచాయతీలకు అప్పగించారా, ఆ భూముల్లో కంచె వేశారా, ఏమైనా అభివృద్ధి పనులు చేపట్టారా అని పలువురు ఎంపీటీసీలు ప్రశ్నించారు. మండలంలో 304 అధికార, 28 అనధికార వెంచర్లు ఉన్నాయని, పంచాయతీకి అప్పగించిన 10 శాతం భూమిలో కంచెను ఏర్పాటు చేస్తామని ఎంపీవో తేజ్‌సింగ్‌ తెలిపారు. మండల కేంద్రంలోని 926 సర్వే నెంబర్‌లో 41 ఎకరాల 32 గుంటల్లో గుర్లకుంట చెరువు ఉందని, దానికి సంబంధించిన భూమి అన్యాక్రాంతమైందని, గ్రామంలో భూములు అమ్ముకున్న రైతులకు రైతుబంధు వస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి తెలిపారు. గుర్లకుంట చెరువును త్వరలో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేస్తామని తాసిల్దార్‌ మహేందర్‌రెడ్డి బదులిచ్చారు. రైతుబంధు, రైతుభీమా పథకాలను అర్హులైన రైతులందరికీ వర్తింపజేయాలని అధికారులకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సూచించారు.  

సమావేశంలో ్రప్రొటోకాల్‌ రగడ...

 మండల సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్‌ రగడ రాజుకుంది. ప్రోటోకాల్‌ నిబంధనల ప్రకారం వైస్‌ ఎంపీపీ ఆనంద్‌ వేదిక మీద ఎలా కూర్చుంటారని జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌తోపాటు ఎంపీటీసీ లచ్చిరాంనాయక్‌, సర్పంచ్‌లు అధికారులను ప్రశ్నించగా, దీంతో ఒక్కసారిగా సమావేశం వేడెక్కింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సర్వసభ్య సమావేశాల్లో వైస్‌ ఎంపీపీ వేదిక మీద కూర్చుంటున్నారని, కడ్తాల్‌ మండలంలోనే తనపై కక్ష సాధింపుతో వేదిక మీద నుంచి దింపేందుకు యత్నిస్తున్నారని ఆనంద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన వేదిక ముందు నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ రాములు కల్పించుకొని మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కలిసికట్టు పనిచేయాలని, వైస్‌ ఎంపీపీకి ప్రోటోకాల్‌ వర్తించదని అనడంతో...ఆనంద్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో సమావేశం నుంచి ఎంపీ రాములు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సైతం సమావేశం నుంచి వెళ్లబోతుండగా ఎంపీటీసీలు, సర్పంచ్‌ల విజ్ఞప్తి మేరకు తిరిగి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వైస్‌ ఎంపీపీ ఆనంద్‌ని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సముదాయించడంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, తాసిల్దార్‌ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో అనురాధ, సింగిల్‌విండో చైర్మన్‌ వెంకటేశ్‌గుప్తా, ఎంపీటీసీలు గోపాల్‌, లచ్చిరాంనాయక్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాములుగౌడ్‌, నిర్మల, ఉమావతి, ప్రియ, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, హరిచంద్‌నాయక్‌, తులసీరాంనాయక్‌, కృష్ణయ్యయాదవ్‌, భారతమ్మ, భాగ్యమ్మ, సులోచన, సుగుణ, విజయలక్ష్మి, రవీందర్‌, లోకేశ్‌నాయక్‌, శంకర్‌, ఎంపీవో తేజ్‌సింగ్‌, ఎంఈవో సర్దార్‌నాయక్‌, ఏఈ వెంకట్‌రెడ్డి, ఎస్సై సుందరయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.