ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Aug 30, 2020 , 00:30:01

రాతి గుట్టలపై మెరిసే వర్ణాలు

రాతి గుట్టలపై మెరిసే వర్ణాలు

కనువిందు చేస్తున్న వెలుగుల ‘వలయం’

గచ్చిబౌలి-శంషాబాద్‌ మార్గంలో ఆకర్షణగా హిల్‌ లైటింగ్‌

ఔటర్‌ పొడవునా ఏర్పాటుకు చర్యలు

రూ.1.49 కోట్లతో టెండర్లకు ఆహ్వానం

4 నెలల్లోనే పనులు పూర్తి..

ఐదేండ్లు ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు

హిల్‌ లైటింగ్‌లో ఔటర్‌ హిట్‌ కొట్టింది. మహానగరానికి మణిహారంగా ఉన్న ఔటర్‌ ఇప్పటికే పచ్చందాలతో విరాజిల్లుతున్నది. తాజాగా.. గచ్చిబౌలి-శంషాబాద్‌ మార్గంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లతో బాహ్య వలయ రహదారి వెలుగుల మయంగా మారింది. దీనికితోడు ఔటర్‌కు ఇరువైపులా ఉన్న గుట్టలకు ఏర్పాటు చేసిన హిల్‌ లైటింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఈ మార్గంలో వెళ్లే వారికి కనువిందు చేస్తున్నది. దీంతో రూ.1.49 కోట్లతో ఓఆర్‌ఆర్‌ పొడవునా మొత్తం హిల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాజధాని మణిహారమైన ఔటర్‌ రింగు రోడ్డుపై ప్రయాణం మరింత కనువిందు చేయనుంది. 158 కిలోమీటర్ల మేర రహదారిలో సెంట్రల్‌ మీడియన్‌లతో పాటు ఇరువైపులా పచ్చని అందాలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా..  గచ్చిబౌలి-శంషాబాద్‌ మార్గంలో ఇరువైపులా ఉన్న గుట్టలకు సరికొత్త సొబగులు అద్దారు. విదేశీ లుక్‌ను తలదన్నేలా హిల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా చేశారు.

గచ్చిబౌలి-శంషాబాద్‌ మార్గంలో..

158 కిలోమీటర్ల ఔటర్‌ ప్రయాణంలో గచ్చిబౌలి-శంషాబాద్‌ మార్గం ప్రత్యేకం. విమానాశ్రయానికి వెళ్లే ఈ దారిలో నిత్యం వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది. 22 కిలోమీటర్ల మార్గంలో 8 లేన్ల మెయిన్‌ కారిడార్‌లోని సెంట్రల్‌ మీడియన్‌లో రూ.30 కోట్లు ఖర్చు పెట్టి ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. ఎన్విరాన్‌మెంటల్‌ ఫ్రెండ్లీ టెక్నాలజీ, ఇతర విద్యుత్‌ లైట్లతో పోల్చితే ఎల్‌ఈడీతో 50 శాతం కరెంటు ఆదా అవుతుంది. పైగా జీఎస్‌ఎం ఆటోమెటిక్‌ సిస్టం ద్వారా ఎక్కడి నుంచైనా పర్యవేక్షించే అవకాశం ఉన్నది. అయితే ఈ మార్గానికి మరింత వన్నె తీసుకువస్తూ.. ప్రత్యేక ఆకర్షణగా హిల్‌ లైటింగ్‌ (రాక్‌ ఔట్‌ క్రాప్‌) అమర్చారు. రహదారికి ఇరువైపులా గుట్టలు, ప్రకృతి రమణీయతతో కూడిన అందాలకు ఎల్‌ఈడీ లైట్లు అమర్చి కొత్త సొబగులను అద్దారు. ఇది ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది.

ఔటర్‌ మొత్తం ఏర్పాటుకు చర్యలు..

ఓఆర్‌ఆర్‌ మొత్తం హిల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు విభాగాల వారీగా కోకాపేట నుండి పటాన్‌చెరు వరకు, పటాన్‌చెరు నుంచి శామీర్‌పేట , శామీర్‌పేట నుంచి పెద్ద అంబర్‌పేట , పెద్ద అంబర్‌పేట నుంచి శంషాబాద్‌ వరకు 15 నుంచి 60 వాట్స్‌ సామర్థ్యం కలిగిన ఎల్‌ఈడీ లైట్లు అమర్చనున్నారు. రాతి గుట్టలతో పాటుగా అందంగా కనిపించేలా కొన్ని చోట్ల చెట్ల నడుమ కూడా ఎల్‌ఈడీ లైట్లు బిగించనున్నారు. ఇందుకోసం ఔటర్‌ విభాగం అధికారులు రూ.1.49 కోట్లతో టెండర్‌ను ఆహ్వానించారు. 120 రోజుల వ్యవధిలో పనులు పూర్తి చేయడంతో పాటు ఐదేండ్ల పాటు సదరు ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నారు. మొత్తంగా అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఔటర్‌ రింగు రోడ్డు సరికొత్త అందాలను సంతరించుకొని ప్రయాణికులకు మరింత ఆనందాన్ని కలిగించనున్నది.