సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Aug 19, 2020 , 00:33:28

హోటల్‌లోయువతిపై లైంగిక వేధింపులు

హోటల్‌లోయువతిపై లైంగిక వేధింపులు

నిందితులు అరెస్టు

శంషాబాద్‌, ఆగస్టు 18: మెడికల్‌ విద్యార్థిని పట్ల ముగ్గురు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మంగళవారం శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసు స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. సీఐ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ఓ యువతి(24) ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతున్నది. కరోనా కారణంగా ఈ నెల 17న ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగింది. అక్కడి నుంచి శంషాబాద్‌ చేరుకున్నది. తను బెంగళూరు బయలుదేరాల్సిన ట్రావెల్స్‌ బస్సు ఆలస్యమైంది. దీంతో ఆమె బస్టాండ్‌ సమీపంలో వేచిఉంది. ఇంతలో ఇద్దరు యువకులు వచ్చి ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నావ్‌.. బస్సు వచ్చే వరకు సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో ఉందామని నమ్మించారు. సాయంత్రం కావడంతో వీజేఆర్‌ హోటల్‌కు వెళ్లి ఓ గది అద్దెకు తీసుకున్నది. అదే హోటల్‌లో ఆమెను తీసుకువచ్చిన యువకులు ఏపీలోని నంద్యాలకు చెందిన విజయ్‌కుమార్‌, పురేందర్‌ మరో గదిలో ఉన్నారు. విజయ్‌కుమార్‌ తండ్రి అనారోగ్యంతో ఉన్నందున చికిత్స నిమిత్తం హోటల్‌లో ఓ గది తీసుకొని ఉంటున్నారు. కాగా శంషాబాద్‌కు చెందిన మరో యువకుడు ప్రవీణ్‌కుమార్‌ వారితో జత కలిశాడు. ముగ్గురు కలిసి ఆమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో యువతి 100కు కాల్‌ చేసింది. పోలీసులు చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకున్నారు. వారిపై ఐపీసీ 354, 509, 506, 510 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. హోటల్‌ యజమాని విద్యాకర్‌రెడ్డి, సిబ్బంది మహేశ్‌పై కూడా కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.