సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Jul 22, 2020 , 00:24:52

పార్సిళ్లకు ‘సురక్ష’

పార్సిళ్లకు ‘సురక్ష’

 రాఖీ పండుగ కోసం స్పెషల్‌ ప్యాకేజీ 

 వస్తువులను భద్రంగా చేరవేస్తున్న ఆర్టీసీ కార్గో

 గ్రేటర్‌లోని 29 డిపోల్లో 85 బస్సుల సేవలు

రంగారెడ్డి, నమస్తే తెంగాణ : టీఎస్‌ ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించింది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడ మే కాకుండా.. ఇప్పుడు సరుకు రవాణా సేవల్లో సైతం అడుగుపెట్టింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు యాజమాన్యం కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించింది. కార్గో సేవల ద్వారా పూడ్చుకోవాలని భావించింది. జిల్లాలోని పలు డిపోల్లో సరుకు రవాణా కేంద్రాలను ప్రారంభించింది. మరికొన్ని చోట్ల త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రయాణికుల రాకపోకలకు వినియోగించే కొన్ని బస్సులను కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవలకు అనుగుణంగా అధికారులు రూపుదిద్దారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ రీజియన్లలోని డిపోల్లో కార్గో బస్సులను సిద్ధం చేశా రు. ఆయా డిపోల నుంచి మూడు, నాలుగు బస్సుల చొప్పున కార్గో సేవలకు వినియోగిస్తున్నారు. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 29 డిపోల్లో 85 కార్గో బస్సులు సేవలందిస్తున్నాయి. ప్రతిరోజు ఒక బస్సుకు రూ. 20వేల ఆదాయం వస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. దాదాపుగా 50 బస్సులకు గాను రూ.8 నుంచి 10లక్షల వరకు ఆదాయం వస్తున్నదని అధికారులు పేర్కొన్నారు. ఆయా డిపోల పరిధిలో సేవలందించేందుకు అక్కడక్కడ బుకింగ్‌ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. హయత్‌నగర్‌ డిపో పరిధిలోని ఆటోనగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో స్థానిక బస్‌ స్టేషన్‌ల్లో ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఒక ఎగ్జిక్యూటివ్‌ను నియమించారు. కార్గో సేవల కోసం బుకింగ్‌ కౌంటర్లలో సంప్రదించవచ్చు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టార్లలో..

ప్రభుత్వ సంస్థలకే కాకుండా ప్రైవేట్‌ సెక్టార్‌లోనూ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సేవలు పొందుతున్నది. సరుకులు, పార్సిళ్ల బరువు, దూరాన్ని బట్టి చార్జీలు ఖరారు చేస్తారు. అంతేగాక సరుకు, పార్సిళ్లకు బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. విలువను బట్టి బీమా సొమ్మును ఖరారు చేయనున్నారు.