e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home రంగారెడ్డి పిల్లలకొస్తే దిగులొద్దు

పిల్లలకొస్తే దిగులొద్దు

పిల్లలకొస్తే దిగులొద్దు

వారికి కరోనా వచ్చినా స్వల్ప ప్రభావమే.. వెంటనే కోలుకుంటారు
ప్రముఖ పిల్లల వైద్యులు సీఎన్‌ రెడ్డి

సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ) : కొవిడ్‌ రెండో దశ కరాళ నృత్యం చేస్తున్నది. వైరస్‌ ఏ రూపంలో విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు దినదిన గండంగా గడుపుతున్నారు. ఇలాంటి సమస్యలున్న పిల్లల విషయంలోనూ ఆందోళన నెలకొంటున్నది. అయితే చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే చిన్నారులను రక్షించుకోవచ్చని చెబుతున్నారు ప్రముఖ పిల్లల వైద్యులు సీఎన్‌ రెడ్డి. కొవిడ్‌ వ్యాప్తి, పిల్లలపై దాని ప్రభావం, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. అవేమిటో ఆయన మాటల్లోనే..

వేడుకలకు వెళ్లకండి
0-10 ఏండ్ల వయస్సు పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిర్ధిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న ఫంక్షన్‌ ఉన్నా వెళ్లకపోవడమే మంచిది. సాధారణంగా పిల్లలు బయటకు వెళ్లరు. పెద్దల ద్వారానే వారికి వైరస్‌ సోకే ప్రమాదమున్నది. అయితే పిల్లల్లో ఏ చిన్న లక్షణం కనిపించినా.. అశ్రద్ధ చేయవద్దు. వెంటనే పరీక్షలు చేయించాలి. ముందస్తుగా గుర్తిస్తే పరిస్థితి చేయిదాటదు. ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లినా.. ఇంట్లోకి వచ్చే ముందు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పిల్లలను మహమ్మారి నుంచి కాపాడుకోవచ్చు.

కరోనా వచ్చినా.. పెద్దగా ప్రభావం ఉండదు
పిల్లలకు కరోనా వస్తే పెద్దగా భయపడాల్సిన పని లేదు. చాలా వరకు చిన్నారులకు పాజిటివ్‌ వచ్చినా లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయి. జాగ్రత్తలు పాటిస్తూ..డాక్టర్ల సలహాల మేరకు మందులు వాడటం, పసిపిల్లలకు తల్లిపాలను కచ్చితంగా పట్టించడం చేయాలి. చిన్నారుల్లో రికవరీ శాతం చాలా ఎక్కువగా ఉంది.

సొంత వైద్యం వద్దు
సాధారణంగా చిన్నారుల్లో దీర్ఘకాలిక సమస్యలు తక్కువగానే ఉంటాయి. అయితే కొందరిలో ఆస్తమా, మరికొందరిలో వాతావరణంలో మార్పులతో జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటాయి. కొంత వరకు కొవిడ్‌ లక్షణాలు కూడా ఇలానే ఉంటాయి. వెంటనే డాక్టర్లను సంప్రదించి.. వారి సలహాల మేరకు టెస్టులు చేయించాలి. సొంత వైద్యం వద్దు.

ఆ వ్యాధులు తగ్గుముఖం
గతంతో పోల్చితే చిన్న పిల్లల్లో వైరల్‌ జ్వరాలు చాలా వరకు తగ్గాయి. ముఖ్యంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ జబ్బులు అంతగా లేవు. ప్రస్తుతం పాఠశాలలు లేకపోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్లని కారణంగా కాలుష్యం బారిన కూడా పడటం లేదు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు పిల్లల్లో తగ్గుముఖం పట్టాయి. దవాఖానల్లో చిన్నారుల అడ్మిషన్ల సంఖ్య 70శాతం తగ్గింది. అయితే కొవిడ్‌ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.

టీకాలు.. మరిచిపోవద్దు
పిల్లలకు వ్యాధులు రాకుండా వేసే వివిధ టీకాల విషయంలో క్రమం తప్పింది. కొందరు తల్లిదండ్రులు వ్యాక్సినేషన్‌ చేయించేందుకు భయపడుతున్నారు. అలా చేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. కచ్చితంగా చిన్నారులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. కరోనాను నియంత్రించడం ఎంత ముఖ్యమో.. పిల్లలకు టీకాలు కూడా అంతే ముఖ్యం.

పిల్లలపై కరోనా పంజా విసరకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారి కుటుంబ సభ్యులదే. శిశువు నుంచి 12 ఏండ్ల లోపు పిల్లలను ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు పంపకూడదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ద్వారానే ఎక్కువగా చిన్నారులకు వైరస్‌ సోకుతున్నది. కొవిడ్‌ నిబంధనలను సరిగా పాటించకపోవడం, రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో పిల్లలు బాధితులవుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ మిగతా వారితో పోల్చితే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. అదనంగా పలు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా చిన్నారులు వైరస్‌ బారిన పడకుండా ఉండేలా చూసుకోవచ్చు.

పాటించాల్సిన జాగ్రత్తలు..
చిన్నపిల్లలు ఉంటే కుటుంబసభ్యులంతా కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి. బయటకు వెళ్లిన ప్రతి సందర్భంలో మాస్కు ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరి.
ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం స్నానం చేయనిదే లోపలికి రాకూడదు. పిల్లలను తాకరాదు.
సాధ్యమైనంత వరకు పిల్లలను ముద్దుపెట్టుకోవడం, పూర్తిగా దగ్గరికి తీసుకోవడం చేయరాదు. కొంత భౌతిక దూరం పాటిస్తే మంచిది.
మూడేండ్ల లోపు పిల్లలకు తినిపించేటప్పుడు ముందుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆపై వయసు వారికి స్వతహాగా తినడం నేర్పించాలి.
తినే ప్లేటు నుంచి టవల్‌, బాత్‌సోప్‌ వంటివి పిల్లలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.
సన్నిహితులు ఎవరైనా ఇంటికి వస్తే.. పిల్లలను దూరంగా ఉంచాలి.
పండ్లు, పాలు తదితర వాటిని వేడినీటితో శుద్ధి చేసిన తర్వాతే ఇవ్వాలి.
ఇంటిని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలి. తద్వారా కొవిడ్‌ వైరస్సే కాదు. ఇతర ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కూడా చిన్నారులను కాపాడుకోవచ్చు.
వేడుకలు, శుభకార్యాలు, ప్రయాణాలకు దూరంగా ఉంచాలి. ఒకవేళ తప్పనిసరి అయితే వ్యక్తిగత వాహనాలనే ఉపయోగించుకోవాలి. మాస్కులను తప్పనిసరిగా ధరించేలా చూడాలి.
అనారోగ్యానికి గురైతే వైద్యశాలలకు పరుగులు తీయకూడదు. ముందుగా ఆన్‌లైన్‌ మెడికల్‌ కన్సల్టెన్సీ ద్వారా వైద్యులను సంప్రదించాలి. వారు సూచిస్తేనే వైద్యశాలకు తీసుకెళ్లాలి.
ఐదేండ్లు పైబడిన పిల్లలకు మాస్కు ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడంపై అవగాహన కల్పించాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పిల్లలకొస్తే దిగులొద్దు

ట్రెండింగ్‌

Advertisement