e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు లాక్‌డౌన్‌ లోనూ ఉపాధి హామీ

లాక్‌డౌన్‌ లోనూ ఉపాధి హామీ

లాక్‌డౌన్‌ లోనూ ఉపాధి హామీ

రంగారెడ్డి జిల్లాలో రోజుకు
49 వేల మంది కూలీలు హాజరు
ఈ ఏడాది లక్ష్యం 80 లక్షల పని దినాలు
ఇప్పటి వరకు 28 లక్షల పని రోజులు పూర్తి
కూలీలకు మాస్క్‌ తప్పనిసరి
45 ఏండ్లు దాటిన వారికి కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌
జిల్లావ్యాప్తంగా 1,57,952 జాబ్‌కార్డులు, 2,88,580 మంది కూలీలు

కరోనా కష్ట కాలంలోనూ పేదలకు ఆర్థిక చేయూతనందించేందుకు తెలంగాణ సర్కారు ఉపాధి హామీ పనులను కొనసాగిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం రంగారెడ్డి జిల్లాలో 80 లక్షల పని దినాలను కల్పించాలన్నది అధికారుల లక్ష్యం. ఇందులో భాగంగా కొవిడ్‌ నిబంధనల మేరకు పనులు సాగుతుండగా, రోజుకు 49 వేల మంది కూలీలు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 28 లక్షల పని రోజులను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. కూలీలు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, లేదంటే పనికి అనుమతించమని అధికారులు పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వ్యాక్సినేషన్‌పై ఇప్పటికే జిల్లా అంతటా అవగాహన కల్పించగా, 45 ఏండ్లు దాటిన 40 శాతం మేర కూలీలకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 1,57,952 జాబ్‌ కార్డులుండగా, 2,88,580 మంది కూలీలు ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ ‘ఉపాధి’ పనులను కొనసాగించి ఆర్థికంగా ఆసరవుతున్నందుకు జనం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

రంగారెడ్డి, మే 15, (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరందుకున్నాయి. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చి నాలుగు రోజులు అయినప్పటికీ పనులకు హాజరయ్యే కూలీలపై ఏమాత్రం ప్రభావం చూపడంలేదు. రంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్‌లోనూ అధిక సంఖ్యలో కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా ఉపాధి హామీ పనులను చేపడుతున్నారు. ఉదయం మూడు గంటలు మాత్రమే పనులు ఉండడంతో జిల్లాలో పనులకు హాజరయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వారం రోజుల క్రితం రోజుకు 35 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరుకాగా, ప్రస్తుతం రోజుకు 49 వేల మంది హాజరవుతున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య ఈ నెలాఖరు వరకు 55 నుంచి 60 వేలకు పెరిగే అవకాశాలున్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఉపాధి హామీ పనుల్లోనూ భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇద్దరు కూలీలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి పనులు కొనసాగిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఉపాధి హామీ పనులకు హాజరయ్యే ప్రతి కూలీ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించి, ధరించిన వారిని మాత్రమే పనులకు అనుమతిస్తున్నారు. 45 ఏండ్లు దాటిన కూలీలందరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటికే జిల్లా అంతటా అవగాహన కల్పించారు. ఇప్పటివరకు 40 శాతం మేర కూలీలకు సంబంధించి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లావ్యాప్తంగా 1,57,952 జాబ్‌ కార్డులుండగా 2,88,580 మంది కూలీలున్నారు.
ఇప్పటివరకు 28 లక్షల పనిదినాలు పూర్తి
ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో 80 లక్షల పని దినాలు కల్పించాలని జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాలో 558 పంచాయతీలుండగా, 530 గ్రామాల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. ఎక్కువగా జిల్లాలోని మాడ్గుల, కడ్తాల్‌, ఆమనగల్లు మండలాల్లో ఉపాధి పనులకు కూలీలు హాజరవుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా హరితహారం కార్యక్రమంతోపాటు ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి ఊట గుంతల నిర్మాణం పనులు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 28 లక్షల పని దినాలు పూర్తయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటివరకు 46 శాతం మేర పూర్తయింది.
ఉపాధిలో చేపడుతున్న పనులు
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో హరితహారంతో పాటు ఇంకుడు గుంతలు, నీటిఊట గుంతల నిర్మాణం, అసైన్డ్‌ భూముల్లోని రాళ్ల ఏరివేత, భూమిని చదునుచేయడం, బౌం డ్రీలు ఏర్పాటు చేయడం, ఎరువు గుంతల నిర్మాణం, బోరుబావి తవ్వించడం తదితర పనులు చేపడుతున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మట్టికట్టలు, నీటి ఊట గుంతలు, పశువులకు షెడ్ల ఏర్పాటు, భూ ఉపరితల నీటి గుంతల నిర్మాణం, పంట కాలువల మరమ్మతులు, పంట మార్పిడి కల్లాలు, కొత్త సేద్యపు బావులు తవ్వడం, నిరవధిక సమతల కందకాలు, ఖండిత సమతల కందకాలు, కొండ దిగువ ప్రాంతాల్లో నీటి నిల్వ కందకాలు, పశువుల నిరోధక కందకాలు, భూసార సంరక్ష కందకాలు, కొత్త పంట కాలువల నిర్మాణం, మైనర్‌ ఇరిగేషన్‌ కాలువలో పూడికతీత, చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణం, వరద కట్టల నిర్మాణం పనులను చేస్తున్నారు.
ప్రతి కూలీకి వందరోజుల పని
ప్రతి కూలీకి వందరోజుల పని కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. గతేడాది వంద రోజుల పని కల్పనలో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఎక్కువ కుటుంబాలకు వంద రోజుల పని కల్పించాలని చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు రోజుకు రూ.245 లతోపాటు వేసవి దృష్ట్యా అదనంగా కూలీ డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఏప్రిల్‌, మే మాసాల్లో 30 శాతం అదనంగా చెల్లిస్తుండగా, జూన్‌లో 20 శాతం అదనంగా చెల్లించనున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌ లోనూ ఉపాధి హామీ

ట్రెండింగ్‌

Advertisement