e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home రంగారెడ్డి మెక్కిన సొమ్మును కక్కించారు

మెక్కిన సొమ్మును కక్కించారు

  • రూ.23.93 లక్షలను దోచేసిన వీవోఏ
  • తీర్మానాలు లేకుండానే ఎనిమిదేండ్లుగా ఆర్థిక లావాదేవీలు
  • శంషాబాద్‌ మండలం యన్నగూడలోని పది సంఘాల సభ్యులను నమ్మించి అవకతవకలకు పాల్పడిన వీవోఏ మహేందర్‌
  • నెలరోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఘటన
  • నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు, విధుల నుంచి తొలగింపు
  • నిందితుడి నుంచి రూ.23.93 లక్షలను రికవరీ చేసిన డీఆర్‌డీఏ యంత్రాంగం

మహిళా సంఘాల సభ్యులను నమ్మించి, పొదుపు డబ్బులను స్వాహా చేశాడు వీవోఏ. ఏకంగా ఎనిమిదేండ్లుగా తీర్మానాలు రాయకుండానే తన ఖాతాలో రూ.23.93 లక్షలను జమ చేసుకున్న సంఘటన శంషాబాద్‌ మండలం రాయన్నగూడ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వీవోఏ మహేందర్‌ ప్రతి నెలా సభ్యుల సంతకాలు తీసుకుని, పొదుపు డబ్బులతో పాటు వారు రుణాలు చెల్లించే నగదును సొంతానికి వాడుకున్నాడు. పర్యవేక్షణ లోపం వల్ల బుక్‌ కీపర్‌గా వ్యవహరించే వీవోఏ తీరును సీసీలు గుర్తించలేకపోయారు. అనుమానం వచ్చిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు డీఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేయగా, విషయం వెలుగులోకి వచ్చింది. నెల రోజుల కింద పూర్తి విచారణ చేసి సంబంధిత వీవోఏను విధుల నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్‌ కేసును నమోదు చేశారు. అంతేకాకుండా నిందితుడు స్వాహా చేసిన సొమ్మును సైతం వసూలు చేశారు.

రంగారెడ్డి, అక్టోబర్‌ 13 (నమస్తే తెలంగాణ) : మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ప్రతీ నెల నిర్వహించే సమావేశాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తీర్మానాలు రాసే వీవోఏ(గ్రామ సంఘం సహాయకుడు) నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిదేండ్లుగా ఎలాంటి తీర్మానాలు రాయకుండానే స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలను తప్పుదోవ పట్టించాడు. పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సిన దాదాపు రూ.24లక్షలను తన ఖాతాలో వేసుకొని మోసానికి పాల్పడ్డ సంఘటన శంషాబాద్‌ మండలం రాయన్నగూడలో జరిగింది. స్వయం సహాయక సంఘాల సభ్యులు బుక్‌ కీపర్‌గా వ్యవహరించే వీవోఏను గుడ్డిగా నమ్మడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సీసీలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ వ్యవహారం జరిగినట్లు సంబంధిత అధికారులు గుర్తించారు.

- Advertisement -

వెలుగులోకి వచ్చింది ఇలా..

శంషాబాద్‌ మండలం రాయన్నగూడ గ్రామపంచాయతీలోని పది గ్రామ సంఘాలున్నాయి, వీటి పరిధిలో 128 మంది సభ్యులున్నారు. సంబంధిత పది గ్రామ సంఘాలకు 2008 నుంచి అదే గ్రామానికి చెందిన ఎన్‌.మహేందర్‌ వీవోఏగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లు బాగానే పనిచేసినా, 2012 సంబంధిత గ్రామ సంఘాల పొదుపు డబ్బులతోపాటు కిస్తులు చెల్లించాల్సిన డబ్బులను దారి మళ్లించాడు. ప్రతీ నెల సమావేశమైన వెంటనే సభ్యుల సంతకాలను సేకరించడంతోపాటు అప్పుల కిస్తు డబ్బులతోపాటు పొదుపు డబ్బులను వసూలు చేసేవాడు. కిస్తు డబ్బుల విషయంలోనూ సభ్యుల నుంచి చెల్లించే దానికంటే ఎక్కువగా వసూలు చేస్తూ వచ్చాడు. ఇలా ఎనిమిదేండ్లుగా సంఘాల సభ్యులను నమ్మించి సంబంధిత గ్రామ సంఘాల డబ్బులన్నింటిని స్వాహా చేశాడు.
ఒక సంఘానికి చెందిన లత అనే సభ్యురాలు రెండు నెలల క్రితం కిస్తు చెల్లించే విషయంలో ఒక రోజు ఆలస్యం కావడంతో రూ.వెయ్యి ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుందని వీవోఏ చెప్పగా, ఆలస్యమైతే రోజుకు రూ.20-50 మాత్రమే ఫైన్‌ విధిస్తారని తెలిసిన సదరు సభ్యురాలు బ్యాంకుకు వెళ్లి వారి సంఘానికి సంబంధించిన లావాదేవీలను ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేండ్లుగా ప్రతీ నెల పొదుపు డబ్బులతోపాటు కిస్తు డబ్బులు చెల్లిస్తున్నా.. బ్యాంకు ఖాతాలో మాత్రం డబ్బులు లేకపోవడం తెలుసుకున్న సభ్యురాలు గ్రామంలోని అన్ని సంఘాల దృష్టికి తీసుకెళ్లగా.. వారంతా డీఆర్‌డీఏ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. విచారణ చేపట్టిన డీఆర్‌డీఏ ఏపీడీ జంగారెడ్డి ఆధ్వర్యంలోని బృందం గ్రామానికి చెంచిన పది సంఘాల ఆర్థిక లావాదేవీల వివరాలకు సంబంధించి ఎనిమిదేండ్ల బ్యాంకు స్టేట్‌మెంట్స్‌ను సేకరించడంతోపాటు సంఘాల పుస్తకాలను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. ఎలాంటి తీర్మానాలు లేకుండానే సంఘాల ఆర్థిక లావాదేవీలను కొనసాగించినట్లు గుర్తించారు. అవకతవకలకు పాల్పడిన వీవోఏపై క్రిమినల్‌ కేసు నమోదు కావడంతోపాటు విధుల నుంచి తొలగిస్తూ డీఆర్‌డీఏ పీడీ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎనిమిదేండ్లగా పది సంఘాల సభ్యుల పొదుపు, కిస్తుల డబ్బులను నిందితుడి నుంచి అధికారులు రికవరీ చేసి, గ్రామ సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement