e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home రంగారెడ్డి అందాల చందన్‌వెళ్లి

అందాల చందన్‌వెళ్లి

అందాల చందన్‌వెళ్లి
  • అభివృద్ధి దూసుకెళ్తున్న చందన్‌వెళ్లి గ్రామం
  • నిత్యం పారిశుధ్య నిర్వహణతో పల్లెతా పరిశుభ్రం
  • అందుబాటులోకి డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామం
  • ఎకరా భూమిలో పల్లె ప్రకృతి వనం
  • ప్రకృతివనంలో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు
  • ఊరంతా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్లు
  • అందుబాటులోకి రైతువేదిక
  • ప్రతి నెలారూ.1.60 లక్షల ప్రభుత్వ నిధులు
  • ‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపు రేఖలు

రంగారెడ్డి, జూలై 13, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని గ్రామపంచాయతీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. గతంలో అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న ఊర్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి. రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నల్లా పనులను చేపట్టడంతో ప్రజలకు సత్ఫలితాలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో షాబాద్‌ మండలం చందనవెళ్లి గ్రామ రూపురేఖలు మారాయి. ఒకప్పుడు సమస్యలు తిష్ట వేసిన గ్రామం, నేడు స్వచ్ఛతలో ముందు వరుసలో నిలిచింది. పల్లెంతా పచ్చని చెట్లతో హరిత శోభను సంతరించుకున్నది. నాగర్‌గూడ-శంషాబాద్‌ వెళ్లే ప్రధాన రహదారి నుంచి మొదలుకొని ఊర్లోకి వెళ్లే వరకు, రోడ్లకు ఇరువైపులా పచ్చని మొక్కలు దర్శనమిస్తున్నాయి. నిత్యం పారిశుధ్య నిర్వహణతో ఊరంతా శుభ్రంగా మారింది. సర్పంచ్‌, అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించడంతో భూగర్భ జలాలను పెంపొందించుకునేలా ఇంటింటికీ ఇంకుడు గుంతలను నిర్మించుకున్నారు. రెండు ఎకరాల్లో వైకుంఠధామాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు.

వివిధ రకాల మొక్కలతో కూడిన పల్లెప్రకృతి వనంలో ప్రత్యేక వాకింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. గ్రామ నర్సరీలో సరిపడా మొక్కలను పెంచుతున్నారు. వేరు చేసిన తడి, పొడి చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. వంద శాతం మరుగుదొడ్లను నిర్మించడంతో స్వచ్ఛ గ్రామంగా తయారైంది. పురాతన ఇండ్లను కూల్చడం, శిథిల భవనాలను తొలగించడం, నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చివేశారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను శుభ్రం చేయడం, గ్రామాల్లో సర్కార్‌ తుమ్మ, జిల్లెడు వంటి కలుపు మొక్కలు, పెంట కుప్పలను తొలగించడంతో పాటు రోడ్లన్నింటినీ శుభ్రం చేస్తున్నారు. డ్రైనేజీల శుభ్రం, మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రశంసనీయం. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తుండటంతో సీఎం కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నారు. ప్రతి నెలా సంబంధిత గ్రామానికి ప్రభుత్వం నుంచి రూ.1.60 లక్షల నిధులు మంజూరవుతున్నాయి. సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తుల సమష్టి కృషితో గ్రామాభివృద్ధి జరుగుతున్నది.

- Advertisement -

‘పల్లె ప్రగతి’లో చేపట్టిన పనులు..
‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో పల్లెలు అభివృద్ధి చెందుతూ రూపుదిద్దుకున్నాయి. చందన్‌వెళ్లి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డు, వైకుంఠధామం, తడి, పొడి చెత్త సేకరణ, చెత్త సేకరణకు ప్రత్యేకంగా ట్రాక్టర్‌ కొనుగోలు, నర్సరీ ఏర్పాటు తదితర పనులను చేపట్టారు. గ్రామపంచాయతీలో రూ.11.42 లక్షలతో ఊర్లో ఎవరు మృతి చెందినా చివరి మజిలీని గౌరవంగా చేయాలనే ఉద్దేశంతో రెండు ఎకరాల స్థలంలో వైకుంఠధామాన్ని నిర్మించారు. అక్కడే స్నానాలు చేసేందుకు మహిళలకు, పురుషులకు ప్రత్యేక స్నానాల గదులనూ నిర్మించారు.

పల్లె ప్రకృతి వనంలో 16 రకాల మొక్కలు..
చందన్‌వెళ్లి గ్రామంలోని ఎకరా స్థలంలో రూ.1.50 లక్షల ఉపాధి హామీ నిధులతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 16 రకాలకు చెందిన 3 వేల మొక్కలను నాటారు. చింత, జామ, ఉసిరి, కొబ్బరి, ఖర్జూర, దానిమ్మ, అల్లనేరేడు, చింత, మర్రి, మేడి, జివ్వి, సిల్వర్‌ రోస్‌, వేప, తులసి, మామిడి, సీమచింత, మారేడు మొక్కలను నాటారు. హరితహారంలో భాగంగా 40 వేల మొక్కలను నాటాలనే ఆదేశాలతో గ్రామ నర్సరీని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది ఏయే మొక్కలు నాటాలో ముందుగానే నిర్ణయించి సంబంధిత మొక్కలనే పెంచుతూ వస్తున్నారు. 12 వేల మొక్కలు నర్సరీలో సిద్ధంగా ఉన్నాయి. చందన్‌వెళ్లి గ్రామ ప్రధాన రహదారితో పాటు కాలనీల రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటారు. గ్రామంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా మొక్కలతో పచ్చదనం సంతరించుకున్నది. రోడ్లకు ఇరువైపులా 483 మొక్కలు, కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో భాగంగా 2,200 మొక్కలు, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ దవాఖాన ప్రదేశాల్లో 950 మొక్కలను నాటారు.

తడి, పొడి చెత్త సేకరణ..
నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి పంచాయతీ సిబ్బంది తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ఇప్పటికే చెత్త డబ్బాలనూ అందజేశారు. ప్రతిరోజు రోడ్లన్నింటినీ శుభ్రం చేస్తున్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థతో ఎక్కడా మురుగు నీరు కనిపించడం లేదు. రూ.1.90 లక్షలతో కంపోస్ట్‌ షెడ్డునూ నిర్మించారు. ఉపాధి హామీ, ప్రజా ప్రతినిధులు, వెల్‌స్పన్‌ పరిశ్రమ వారు ఇచ్చిన నిధులతో చందన్‌వెళ్లి గ్రామమంతా సీసీ రోడ్లనూ నిర్మించారు. ఏ ఒక్క కాలనీలోనూ మట్టి రోడ్డు కనిపించే పరిస్థితి లేదు. రూ.15 లక్షలతో ఊరంతా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామ సర్పంచ్‌ కొలన్‌ ప్రభాకర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధికి గ్రామస్తులు కూడా సహకరిస్తూ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అందాల చందన్‌వెళ్లి
అందాల చందన్‌వెళ్లి
అందాల చందన్‌వెళ్లి

ట్రెండింగ్‌

Advertisement