కులకచర్ల, జూలై 9 : అది ఒక చిన్న పల్లె.. పంచాయతీ పరిధిలో ఉన్న తండా.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చిన్నచిన్న పల్లెలు, తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అడవివెంకటాపూర్ గ్రామానికి అనుబంధంగా ఉన్న భజ్యనాయక్ తండా కొత్త పంచాయతీగా ఏర్పడింది. నూతన పంచాయతీకి అందే నిధులకు తోడుగా ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం అమలులోకి రావడంతో తండాకు వరంగా మారింది. 668 జనాభా, 462 మంది ఓటర్లు ఉన్న తండా అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న తండా నేడు అద్భుతంగా తయారైంది. ఇంటింటికి చెత్త బుట్టలను అందజేసి తడి, పొడి చెత్తను వేరు చేయిస్తున్నారు. నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.
ప్రతి వీధిలో మురుగు కాల్వలు, ఇంటింటికీ మరుగుదొడ్డిని నిర్మించారు. ఎవరైనా బహిర్భూమికి వెళితే రూ.500 జరిమానా విధిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది ప్రతి వీధిని పరిశుభ్రంగా మారుస్తుండడంతో స్వచ్ఛ గ్రామంగా కళకళలాడుతున్నది. పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలు నాటడంతో ఎంతో ఆహ్లాదకరంగా మారింది. గ్రామానికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటడంతో అవి ఏపుగా పెరిగి పచ్చని తోరణాల్లా కనువిందు చేస్తున్నాయి. పంచాయతీ నీటి ట్యాంకర్‌తో మొక్కలకు నీళ్లు పోస్తూ సంరక్షిస్తుండడంతో పల్లెంతా పచ్చందాన్ని సొం తం చేసుకున్నది. గ్రామ నర్సరీలో హరితహారానికి సరపడా మొక్కలను పెంచుతున్నారు. చివరి మజిలీ కోసం వైకుంఠధామాన్ని నిర్మిం చి ఫెన్సింగ్‌నూ ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాను బిగించడంతో తాగునీటి సమస్య తీరింది. ప్రతి వీధిలో సీసీ రోడ్డును నిర్మించారు. విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ బల్బులను అమర్చడంతో రాత్రి వేళల్లో జిగేల్మంటున్నాయి. ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న భజ్యనాయక్తండా ‘పల్లె ప్రగతి’తో రూపు రేఖలు మారాయి.
చకచకా అభివృద్ధి
భజ్యనాయక్తండాలో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ప్రతి వీధిలో సీసీ రోడ్డు, ఇంటింటికీ మరుగుదొడ్డిని నిర్మించాం. నిత్యం చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నాం. వైకుంఠధామం అందుబాటులోకి వచ్చింది.
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం…
గ్రామస్తుల సహకారంతో మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ప్రతి నెలా ప్రభుత్వం అందించే నిధులను సక్రమంగా వినియోగించుకుంటున్నాం. గ్రామాభివృద్ధికి ప్రణాళికను రూపొందించుకుని సమష్టిగా ముందుకెళ్తాం.