ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, మే 7: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయలో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నది. శుక్రవారం ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీతో పాటు మండలంలోని రాయపోల్, దండుమైలారం, ముకునూరు గ్రామాల్లో వైద్యారోగ్యశాఖ సిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్ఎమ్లు ఇంటింటా జ్వర సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా ఎవరికైనా జ్వరం, జలుబు లక్షణాలుంటే అవసరమైన వారిని హోం ఐసోలేషన్ చేసి, కిట్స్ అందజేస్తున్నారు.
మంచాలలో ముమ్మరంగా..
మండలంలోని వివిధ గ్రామాల్లో కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేందుకు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, వైద్యాధికారులు, ఆశావర్కర్లు, అంగన్వాడీలు ఇంటింటికీ వెళ్లి ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. జాపాలలో 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేస్తున్నారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో
తుర్కయాంజాల్, మే7: మున్సిపాలిటీలో ఇంటింటా జ్వర సర్వేను విస్త్రృతంగా నిర్వహించారు. అధికారులు జ్వర సర్వేకు సంబంధించిన పరికరాలను ఆశా వర్కర్లకు అందజేయగా వారు సిబ్బందితో కలిసి వార్డుల్లో సర్వే చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లోని వ్యక్తులకు పరీక్షలు చేశారు. నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా జ్వరం వచ్చి కరోనా లక్షణాలు ఉన్నవారికి నేరుగా కరోనా హెల్త్ కిట్‌ను అందజేయనున్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో జ్వర సర్వే చేస్తామని కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా తెలిపారు.
చింతకుంటపల్లిలో..
కేశంపేట, మే7: కరోనా కట్టడిలో భాగంగా మండలంలోని చింతకుంటపల్లిలో సర్పంచ్ పార్వతమ్మ, అధికారు లు, అంగన్వాడి, ఆశావర్కర్లు ఇంటింటికీ తిరిగి జర సర్వే చేశారు. జ్వరం, జలుబు ఉన్న వారికి అక్కడే మందులు పంపిణీ చేశారు. కరోనా లక్షణాలుంటే ఐసోలేషన్‌లో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శేఖర్, అంగన్వాడి కార్యకర్త శ్రీదేవి, ఆశా కార్యకర్త జ్యోతి, ఎన్‌వైకే మండల కోఆర్డినేటర్ రమేశ్‌యాదవ్ పాల్గొన్నారు.
శంకర్‌పల్లిలో..
శంకర్పల్లి రూరల్, మే7: మండల కేంద్రంలో ముమ్మరంగా ఇంటింటా జ్వర సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టంగటూర్ గ్రామంలో ఎంపీడీవో సత్తయ్య వైద్య సిబ్బందితో కలిసి జ్వర సర్వే నిర్వహించారు. కరోనా తగ్గుముఖం పట్టేవరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టంగటూర్ పీహెచ్సీ వైద్య బృందం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.