e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు గ్రామీణ రోడ్ల‌కు మ‌హార్ద‌శ‌

గ్రామీణ రోడ్ల‌కు మ‌హార్ద‌శ‌

గ్రామీణ రోడ్ల‌కు మ‌హార్ద‌శ‌

రంగారెడ్డి జిల్లాలో రూ.21.14కోట్లతో ఏడు రోడ్లు, రూ.14.63 కోట్లతో 4 బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు
టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించండి
నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి
ఇటీవల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు
దాదాపు పూర్తైన వైకుంఠధామాల నిర్మాణం

రంగారెడ్డి, జూన్‌ 5, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ కల్పించబోతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం తన ఛాంబర్‌లో జిల్లాలోని రహదారుల అభివృద్ధి పనులపై మంత్రి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద జిల్లాకు మంజూరైన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో రూ.21.14కోట్లతో ఏడు రహదారులు, రూ.14.63కోట్లతో 4 బ్రిడ్జిల నిర్మాణానికిగాను ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. నిధులు మంజూరైన రహదారుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం-గుమ్మడివెల్లి వయా చౌదరిపల్లి, తుర్కగూడ-కొంగరకలాన్‌ వయా పోచారం రోడ్లు, రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో శంకరాపూర్‌-ఘాంసిమియాగూడ, జాతీయ రహదారి నుంచి కాచారం వరకు వయా జూకల్‌, షాబాద్‌-పాలమాకుల వయా నానాజీపూర్‌, చేవెళ్ల నియోజకవర్గంలోని నాగర్‌గూడ-కడ్మూర్‌ బ్రిడ్జి వరకు రోడ్డు పనులు మంజూరు అయినట్లు తెలిపారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లి-కాకునూర్‌, ఉమ్మెంత్యాల-షాబాద్‌ వెళ్లే దారిలో, కల్వకుర్తి నియోజకవర్గంలోని శంకర్‌కొండతండా-మెడ్డగడ్డ దారిలో, షాబాద్‌ రోడ్డు నుంచి పాలమాకుల వెళ్లే దారిలో బ్రిడ్జిలను నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయన్నారు. సంబంధిత రోడ్లు, బ్రిడ్జిల పనులకు త్వరితగతిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, పనులను ప్రారంభించాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా చేపట్టిన వైకుంఠధామాలు దాదాపు పూర్తయ్యాయని, పెండింగ్‌లో ఉన్న 14 వైకుంఠధామాలను కూడా వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ శాఖ ఈఈలు సురేశ్‌చంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
షాద్‌నగర్‌, జూన్‌ 5 : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొక్కలను నాటిన అనంతరం మాట్లాడారు. మానవ మనుగడ పర్యావరణంపై ఆధారపడి ఉందని, ప్రజలు పచ్చదనాన్ని పెంచేందుకు ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. హరితహారం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేట కోట్ల మొక్కలను నాటుతున్నదని, చెట్ల సంరక్షణలో మనం భాగస్వాములం కావాలని చెప్పారు. చెట్లను నరికితే శాఖాపరమైన చర్యలుంటాయని, అందుకు సర్కార్‌ ప్రత్యేక చట్టాలను రూపొందించిందన్నారు. ప్రభుత్వ పనితీరుతో రాష్ట్రంలో అడవుల శాతం పెరిగిందని వివరించారు. కార్యక్రమంలో మేయర్‌ పారిజాత, డిప్యూటీ మేయర్‌ శేఖర్‌, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులున్నారు.

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు
సీఎం కేసీఆర్‌ పనితీరుతోనే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ, బడంగ్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో, జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రీమియర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు టీకాను వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిపై ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమై వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. గాంధీ, టిమ్స్‌ వంటి సర్కారు దవాఖానల్లో కొవిడ్‌ రోగులకు సంపూర్ణ వైద్యం అందుతున్నదని చెప్పారు. రోగులకు సరిపడ మందులు, ఇతర వసతులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని అందరికి కరోనా టీకాను అందించాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా.. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతంగా గ్లోబల్‌ టెండర్‌ విధానం ద్వారా టీకాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకున్నప్పటికీ, కేంద్రం అడ్డుపడే పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్రంలో హై రిస్క్‌ గ్రూపులకు, నిత్యం ప్రజలతో సంబంధాలు ఉండే సిబ్బంది, కార్మికులకు, వ్యక్తులకు తొలి ప్రాధాన్యతను ఇస్తూ వారికి టీకాలను వేయిస్తున్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని సంబంధిత వ్యక్తులు, వ్యాపారులు, కార్మికులు, చిరు వ్యాపారులు, హోటళ్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులున్నారు.

పనులను వెంటనే ప్రారంభించాలి
వికారాబాద్‌, జూన్‌ 5, (నమస్తే తెలంగాణ) : ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన(పీఎంజీఎస్‌వై) కింద వికారాబాద్‌ జిల్లాకు మంజూరైన పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని రహదారుల అభివృద్ధి పనులపై మంత్రి తన ఛాంబర్‌లో సమీక్షించారు. నవాబుపేట మండలం చించల్‌పేట్‌ నుంచి నారగూడ వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.7.18 కోట్లు, దౌల్తాబాద్‌ మండలం అంత్వార్‌ నుంచి దౌల్తాబాద్‌ వరకు రూ.1.5కోట్లతో, పూడూరు మండలం రాకంచర్ల నుంచి పుడుగుర్తి వరకు ఉన్న రోడ్డుపై రూ.1.89కోట్లతో బ్రిడ్జిల నిర్మాణం కోసం నిధులను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మంజూరై నిర్మాణంలో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఇంకా పూర్తి కావాల్సిన 35 వైకుంఠధామాల పనులను పది రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా స్థానిక శాసనసభ్యులను సంప్రదించి ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కార్యనిర్వాహక ఇంజినీర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గ్రామీణ రోడ్ల‌కు మ‌హార్ద‌శ‌

ట్రెండింగ్‌

Advertisement