శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Jul 08, 2020 , 23:00:37

రాజీవ్‌ గృహకల్ప ఇండ్లు అన్యాక్రాంతం

రాజీవ్‌ గృహకల్ప ఇండ్లు అన్యాక్రాంతం

రంగారెడ్డి కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌తో సమావేశంలో ఎమ్మెల్యే గాంధీ

హైదర్‌నగర్‌, జూలై 8 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పేద, మధ్య తరగతి లబ్ధిదారులకోసం నిర్మించిన రాజీవ్‌ గృహకల్ప నివాసాలను అసలైన లబ్ధిదారులకు చేరకుండా మధ్యలో కొందరు అన్యాక్రాంతం చేశారని, అలాంటి వారిపై చట్టపరంగా  కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ను కోరారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలు, గ్రంథాలయ నిర్మాణాల కోసం తగిన స్థలాలను కేటాయించాలని విప్‌ కోరారు. ఈ మేరకు చేవెళ్ల పార్లెమెంట్‌ సభ్యుడు రంజిత్‌రెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌తో విప్‌ గాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ఎంపీ సమక్షంలో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు గతంలో మంజూరు చేసిన నిధులకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విప్‌ గాంధీ కోరారు. కొండాపూర్‌ ఏరియా దవాఖానలో తగినంత సిబ్బందిని నియమించి విస్తృత సేవలను కొనసాగించాలన్నారు. రెవెన్యూ విభాగానికి సంబంధించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని గాంధీ కోరారు. సీడీఎఫ్‌, డీఎంఎఫ్‌ నిధుల ద్వారా మంజూరైన పనులను త్వరగా పూర్తి చేయాలని, విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కలెక్టర్‌ను విప్‌ గాంధీ కోరారు. ఈ మేరకు ఆయన వినతిపత్రాన్ని అందించారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించినట్లు విప్‌ గాంధీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ హరీశ్‌ పాల్గొన్నారు.