శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 09, 2020 , 23:05:16

మనో ధైర్యమే మందు

మనో ధైర్యమే మందు

చిట్కాలతోనే కరోనాను జయించా 

కరోనాపై గెలిచిన సరూర్‌నగర్‌ తాసీల్దార్‌ రాంమోహన్‌రావు 

బడంగ్‌పేట: ‘కరోనా వచ్చిందనగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదో జరిగిపోతుందనే ఆందోళన వీడి ధైర్యంతో ఉండాలి. మనోధైర్యానికి మించిన మందు లేదు’ అని సరూర్‌నగర్‌ మండ ల తహసీల్దార్‌ రాంమోహన్‌ రావు అన్నారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన తన అనుభవాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.. 

ఏమీ కాదనుకున్నా.. 

సరూర్‌నగర్‌ మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన కాలం చాలా జాగ్రత్తగా ఉన్నా. శంషాబాద్‌ విమానాశ్రయంలో డ్యూటీ వేశారు. మూడు రోజులు అక్కడ పని చేశా. మరుసటి రోజు నుంచి తల, ఒంటి నొప్పులు మొదలయ్యాయి. ఏమీ కాదనుకొని జూలై 3న విధులకు హాజరయ్యా. డ్యూటీలో ఉండగానే బాగా జ్వరం వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో జూలై 6న సరూర్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్ట్‌ చేయించుకున్నారు. పాజిటివ్‌ వచ్చింది. అనుమానంతో జూలై 9న ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నా. అదే ఫలితం వచ్చింది. 10న ఇంట్లో ఉన్న వారందరికి పరీక్షలు చేయించగా నా భార్య, ఇద్దరు కూతుర్లు. మూడు నెలల మనుమరాలు, రెండు సంవత్సరాల మనుమడికి కరోనా సోకింది. పాజిటివ్‌ వచ్చిన విశయాన్ని  రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, జేసీ హరీశ్‌ కుమార్‌, డీఆర్‌వో హరిప్రియ, ఆర్డీవో రవీందర్‌రెడ్డికి ఫోన్‌ చేసి  చెప్పా. వారు ప్రతిరోజు నా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెప్పారు. 

హోం క్వారంటైన్‌లో 28 రోజులు.. 

కరోనా వచ్చిన తర్వాత 28 రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నా. వారం రోజుల పాటు ప్రభుత్వం ఇచ్చిన ఐదు రకాల మందులు వేసుకున్నా. ఇంట్లో ఉండే వస్తువులే అసలైన వ్యాక్సిన్‌. కషాయం, వేడి నీరు, నిమ్మరసం, తులసీ ఆకు, పసుపు క్రమం తప్పకుండా తీసుకున్నా. ఉన్నతాధికారులతో పాటు కొవిడ్‌ హెల్ప్‌లైన్‌, డీఎంహెచ్‌వో ఆఫీస్‌, 104 నుంచి ప్రతిరోజు ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మనోధైర్యం కల్పించగా నాలో భయం పోయింది. చిన్న పిల్లలకు సోకిందని తెలియగానే కొంత భయపడ్డా. 

వంటింటి వైద్యమే కాపాడింది..

ఇంట్లోని దినుసులే వైరస్‌కు అసలైన వ్యాక్సిన్‌. ఎలాంటి ఆందోళన చెందలేదు. కషాయం, వేడి నీరు, నిమ్మరసం, పసుపు క్రమం తప్పకుండా తీసుకున్నా. ప్రతిరోజు వ్యాయామం చేశా. 

భయపడాల్సిన అవసరం లేదు.. 

పాజిటివ్‌ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. నాకు సైనస్‌ ఉంది. శ్వాస తీసుకోవడంలో వారం రోజులు కొంత ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత క్రమ క్రమంగా కోలుకున్నా. 

ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకున్నా. కరోనా వచ్చిందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నిత్యం ఆవిరి పట్టడం, డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవాలి. భయం రోగాన్ని పెంచుతుంది. ఆత్మైస్థెర్యం బలాన్ని పెంచుతుంది. బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. శానిటైజర్‌ వెంట ఉంచుకోవాలి. జన సమూహం ఉన్న చోటికి వెళ్లకపోవడమే మంచిదని వివరించారు.