బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Sep 23, 2020 , 00:57:08

ఎవరెన్ని కుట్రలు పన్నినా ఫార్మాసిటీ ఆగదు

ఎవరెన్ని కుట్రలు పన్నినా ఫార్మాసిటీ ఆగదు

ఫార్మా భూ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

భూములివ్వడానికి నేడు అంగీకార పత్రాలు ఇవ్వండి

అవార్డు జారీ అయితే రైతులకు తీవ్ర నష్టం

ఎకరాకు రూ.16లక్షలకు బదులు రూ.7.5లక్షలు కోర్టులో జమ

రెచ్చగొట్టే వారి మాటలు విని మోసపోవద్దు

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

యాచారం : ఫార్మా భూ నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా ఫార్మాసిటీ ఆగే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఫార్మాసిటీకి భూములివ్వడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. బుధవారం సాయంత్రంలోపు రైతులు తమ అంగీకార పత్రాలను స్థానిక తాసిల్దార్‌కు అందించాలన్నారు. మండలంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి అనవసరపు సమావేశాలు పెట్టి రైతులను కావాలని రెచ్చగొడుతున్న కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. పట్టా భూముల రైతులకు పరిహారం పెంపు విషయంలో ఇకపై ఎటువంటి నిర్ణయాలు వెలువడే అవకాశాలు లేవన్నారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.12.5లక్షలున్న పరిహారాన్ని రూ.16లక్షలకు పెంచిందని.. దీంతోపాటు ప్రభుత్వం కందుకూరు మండలంలోని బేగరి కంచెలో ఏర్పాటు చేయనున్న హెచ్‌ఎండీఏ వెంచర్‌లో ఎకరాకు 121గజాల ప్లాటు, ఇంటికో ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో అవార్డు జారీ అయితే రైతులకు ఎకరాకు రూ.16లక్షలు కాకుండా కేవలం రూ.7.5లక్షలు మాత్రమే నష్టపరిహారం అందుతుందన్నారు. ఫార్మాకు సహకరించని రైతులు ఇంటి స్థలంతోపాటు ఉద్యోగ అవకాశానికి అనర్హులన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వమే జాతీయ హోదాను కల్పించిందన్నారు. రైతులు చెప్పుడు మాటలు వినకుండా ధైర్యంగా పట్టా భూములివ్వడానికి ముందుకు రావాలన్నారు. ఫార్మా భూ నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో ఇక్కడి ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఫార్మాకు రైతులు, రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.