బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Sep 29, 2020 , 00:32:51

ముంపు ప్రాంతాల్లో..ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ముంపు ప్రాంతాల్లో..ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాలు తగ్గుముఖం పట్టగానే సహాయక చర్యలు వేగవంతం చేయిస్తాం

వరదనీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకోండి

మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్లకు మంత్రి సబితారెడ్డి ఆదేశం

 బడంగ్‌పేట: వర్షాలు తగ్గుముఖం పట్టగానే సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీచేశారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్మాస్‌గూడ, నవయుగ కాలనీల్లో ఆదివారం రాత్రి పర్యటించారు. కాలనీల్లో నిలిచిపోయిన వరదనీటిని పరిశీలించారు. ముంపు సమస్య నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు అధికారులు ప్లాన్‌ చేసుకోవాలన్నారు. సోమవారం ఉదయం నుంచి మంత్రి అధికారులతో మాట్లాడి వరదనీరు పోయేలా చర్యలు తీసుకోవాలని బడంగ్‌పేట మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణ మోహన్‌రెడ్డి, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సుమన్‌రావులకు ఆదేశాలు జారీచేశారు. మంత్రి ఆదేశాల మేరకు మీర్‌పేట పెద్ద చెరువు తూము దగ్గర క్లీనింగ్‌ కార్యక్రమం చేపట్టారు. తూములకు అడ్డంగా ఉన్న చెత్తను తొలగించి నీళ్లు పోయేలా ఏర్పాటు చేశారు. నవయుగ కాలనీల్లో ఉన్న సమస్యను మరోసారి పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపు సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటామన్నారు. ట్రంక్‌ లైన్‌ సమస్య పూర్తయితే వరద సమస్య ఉండదన్నారు. ట్రంక్‌ లైన్‌ పనులను త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. కార్యక్రమంలో బడంగ్‌పేట కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్‌ పెద్ద బావి శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, నాయకులు శేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ బడంగ్‌పేట యువ జన విభాగం అధ్యక్షుడు పెద్ద బావి నాగ నందీశ్వర్‌రెడ్డి, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు, కాలనీ వాసులు ఉన్నారు. 

దెబ్బతిన్న రోడ్ల పరిశీలన..

 బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 23వ వార్డులో మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పర్యటించారు. కొట్టుకపోయిన రోడ్డు, డ్రైనేజీ పైపులైన్లను పరిశీలించారు. గుంతలమయంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. చాలా కాలనీల్లో వరదనీరు నిలిచిపోయిందని తెలిపారు. అధికారులతో మాట్లాడి పనులు చేయిస్తామన్నారు. మంత్రి సబితారెడ్డి సహకారంతో పనులు వేగవంతంగా చేయిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు లిక్కి మమత కృష్ణారెడ్డి, రాళ్ల గూడెం సంతోషి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.