ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Aug 03, 2020 , 00:14:40

పార్కులు.. అభివృద్ధి.. ఆహ్లాదం

పార్కులు.. అభివృద్ధి.. ఆహ్లాదం

బడంగ్‌పేటలో పార్కుల అభివృద్ధికి శ్రీకారం

చకచకా కొనసాగుతున్న పనులు

ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటు

హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు

బడంగ్‌పేట : ఆధునిక కాలంలో మానవ జీవనం ఉరుకులు పరుగులతో తీరిక లేకుండా మారింది. అయితే సేద తీరేందుకు తెలంగాణ ప్రభుత్వం పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో 146 పార్కులను రికార్డుల ప్రకారం అధికారులు గుర్తించారు. దశలవారీగా పార్కులను తీర్చిదిద్దడానికి  ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  28వ వార్డు పరిధిలోని నైన్‌హిల్స్‌, సప్తగిరి హిల్స్‌ కాలనీల్లో రూ.13లక్షలతో పార్కుల చుట్టూ ప్రహరీ, గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. పార్కులను అభివృద్ధి చేయాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇప్పటికే  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పార్కు స్థలాలు కబ్జా కాకుండా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తానని, ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఓపెన్‌ స్థలాలను కబ్జా చేస్తే  కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీవాసులకు పార్కులు ఎంతగానో ఉపయోగ పడుతాయని అధికారులు పేర్కొంటున్నారు. అందుకే వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆహ్లాదాన్ని పంచేందుకు మొక్కలు నాటుతామని వెల్లడించారు. పార్కుల్లో వ్యాయామం చేసుకోవడానికి ఓపెన్‌ జిమ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పార్కులను అభివృద్ధి చేస్తాం

నియోజకవర్గ వ్యాప్తంగా పార్కుల ను అభివృద్ధి చేస్తున్నాం. కార్పొరేషన్‌ పరిధిలోని పార్కులు, ఓపెన్‌ స్థలాలు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతాం.  పార్కుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశాను. వాకింగ్‌ ట్రాక్‌,  ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. మొక్కలు నాటాలని ఆదేశించాం.

- సబితాఇంద్రారెడ్డి, మంత్రి  

మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు       

కార్పొరేషన్‌ పరిధిలోని పార్కులు, ఓపెన్‌ స్థలాలను గుర్తిస్తున్నాం. అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నాం.  స్థానికులకు ఆహ్లాదాన్ని పంచేందుకు మొక్కలు నాటిస్తున్నాం. కాలనీల వాసులు పార్కులను వినియోగించుకోవాలి. నిధులను మంజూరు చేస్తున్న మంత్రి సబితాఇంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. - చిగిరింత పారిజాత, మేయర్‌