బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Sep 05, 2020 , 01:15:52

పల్లెకు వరం ప్రకృతి వనం...

పల్లెకు వరం ప్రకృతి వనం...

867 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు 

560 పంచాయతీలు.. మరో 307 అనుబంధ గ్రామాలు 

517 గ్రామాల్లో స్థలాల గుర్తింపు పూర్తి

నెలాఖరులోగా పూర్తిచేసేందుకు సన్నాహాలు

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : జిల్లాలో చేపట్టిన పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కార్యక్రమంతో గ్రామాలు ‘ప్రకృతి’ శోభను సంతరించుకుంటున్నాయి. ఇప్పటి వరకు పల్లెప్రగతి కింద గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టిన అధికార యంత్రాంగం ఉపాధి హామీ పథకం కింద భారీగా ఖర్చు చేసి ఈ ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నది. గ్రామాల్లోని ప్రజలు ఆహ్లాదకరంగా గడపడంతో పాటు ఉదయం,సాయంత్రం పూట వాకింగ్‌ చేసేలా వీటిని రూపొందిస్తున్నారు. జిల్లాలో మొత్తం 560 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.  307 అనుబంధ గ్రామాలు ఉన్నాయి.మొత్తం  867 చోట్ల ఈ వనాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటి వరకు 517 గ్రామ పంచాయతీల్లో భూమిని గుర్తించారు. 440 గ్రామ పంచాయతీల్లో ల్యాండ్‌ లెవెలింగ్‌ పూర్తి చేశారు. 381చోట్ల ప్లాంటింగ్‌ ప్రారంభించారు. ఈ పనులకోసం ఇప్పటి వరకు 64.63లక్షలు ఖర్చు చేశారు. 

 అన్నిచోట్లా ఫెన్సింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌లు

    మండలాలవారీగా జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌లు గ్రామాల్లో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేస్తున్నందున ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పార్క్‌ కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందుక్సోం ప్రతీ గ్రామంలో అర ఎకరం నుంచి ఎకరంన్నర వరకు స్థలాలను గుర్తిస్తున్నారు. ఈ వనాల చుట్టూ ఫెన్సింగ్‌ తో పాటు వాకింగ్‌ ట్రాక్‌ నిర్మిస్తున్నారు. ఉపాధి హామీ కింద ఒక్కొక్క వనానికి రూ.2లక్షల 90వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కొన్ని గ్రామాల పరిధిలో అటవీ భూములు, తదితర సమస్యలున్నాయి. అక్కడ కూడా సమస్యలు పరిష్కరించి భూములు గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు రెండేళ్లు మెయింటెనెన్స్‌ కోసం మరో రూ.3లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. ఈ పల్లె ప్రకృతి వనాల్లో 20కి పైగా రకాల మొక్కలను నాటుతున్నారు.ఫెన్సింగ్‌ పక్కన త్వరగా ఎత్తు ఎక్కువ పెరిగే మొక్కలు నాటుతున్నారు. మామిడి, సీతాఫలంతో పాటు ఇతర పండ్ల మొక్కలను కూడా నాటుతున్నారు. ఈ నెలాఖరులోపు పనులు పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

క్షేత్రస్థాయిలో తనిఖీలు..

ప్రతీక్‌ జైన్‌,రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ 

   పల్లె ప్రకృతి వనం కింద 560 గ్రామాలకు గాను 517 గ్రామ పంచాయితీల్లో భూములను గుర్తించాము. ఇప్పటివరకు 398 గ్రామాల్లో మొక్కలు నాటడం పూర్తయ్యింది. మిగిలిన గ్రామాలలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. కందుకూరు, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల డివిజన్లలోని పల్లె ప్రకృతి వనాల్లో భారీసంఖ్యలో మొక్కలు నాటాం. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఈ మొక్కలు తనిఖీ చేస్తున్నాము. అవెన్యూ ప్లాంటేషన్‌కు సంబంధించి 10 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3లక్షల మొక్కలను నాటగా, మిగిలిన 7 లక్షల మొక్కలు తొందరగా నాటాలని ఆదేశించాం.