గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jul 26, 2020 , 00:50:44

వరాల జల్లు..

వరాల జల్లు..

3600 ఎకరాల్లో ప్రత్యేక పారిశ్రామిక పార్కు

రూ. 220 కోట్లతో శంషాబాద్‌-హైతాబాద్‌కు నాలుగులేన్ల రహదారి

రూ. 50 కోట్లతో హైతాబాద్‌-నాగరగూడకు ..

రూ. 54 కోట్లతో 220/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ 

రంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారనున్నాయన్న మంత్రి కేటీఆర్‌ 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌: రంగారెడ్డి జిల్లాపై మంత్రి కేటీఆర్‌ వరాల జల్లు కురిపించారు. జిల్లా ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న పరిశ్రమలతో ఈ ప్రాంతం రూపురేఖలే మారనున్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందనవెళ్లిలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్‌ పరిశ్రమను ప్రారంభించిన ఆయన ..అనంతరం ఏర్పాటు చేసిన సభలో  మాట్లాడారు. సీతారాంపూర్‌లో 3600 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఐలాను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. స్థానిక యువకుల్లో నైపుణ్యం పెంచి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంతంలో స్కిల్‌ డవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రూ. 220 కోట్లతో శంషాబాద్‌ నుంచి హైతాబాద్‌ వరకు, మరో రూ. 50కోట్లతో నాగరగూడ నుంచి హైతాబాద్‌ వరకు నాలుగు లేన్ల రహదారులను నిర్మిస్తామన్నారు. రూ. 54 కోట్లతో హైతాబాద్‌లో 220/ 11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.  ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక యువతకే ఉద్యోగవకాశాలు

రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ 

తన పార్లమెంట్‌ పరిధిలో ఏర్పాటయ్యే ప్రతి కంపెనీలో స్థానిక యువతకే  ఉద్యోగవకాశాలు వచ్చేలా తన వంతు ప్రయత్నం చేస్తానని ఎంపీ రంజిత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేందుకు మంత్రి కేటీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు రావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. 

సంతోషంగా ఉంది

ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. ప్రతి పరిశ్రమలో స్థానిక యువతకే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.

ఉద్యోగాలు కల్పిస్తాం: ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి

చందనవెళ్లి టెక్స్‌టైల్స్‌ పార్కులో స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పిస్తామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. రూ.2వేల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.  సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం, మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. 

ఘనంగా స్వాగతం.. 

అంతకుముందు మంత్రి కేటీఆర్‌ మొయినాబాద్‌, చేవెళ్ల చౌరస్తాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలు ఆవిష్కరించారు. ఆయనకు అడుగడుగునా గులాబీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. హైతాబాద్‌ చౌరస్తాలో జెండాను ఆవిష్కరించిన కేటీఆర్‌ ప్రసంగించారు. భవిష్యత్‌లో షాబాద్‌తో పాటు చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మండలాల్లో మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమర్‌, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌, కొప్పుల మహేశ్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ అనితారెడ్డి,  జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ఎండీ నర్సింహారెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, విద్యా, మౌలిక వసతుల కల్పన చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, షాబాద్‌ ఎంపీపీ కోట్ల ప్రశాంతి, మొయినాబాద్‌ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌, సర్దార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నక్క శ్రీనివాస్‌గౌడ్‌, పీఏసీఏస్‌ చైర్మన్‌ చల్లా శేఖర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.