శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 19, 2020 , 23:09:27

మనోధైర్యంతో జయించాలి

మనోధైర్యంతో జయించాలి

  కరోనా బారిన పడితే భయపడొద్దు.. ధైర్యంగా ఉండాలి

  ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 

  కొవిడ్‌ బాధితులకు సొంత ఖర్చుతో డ్రైఫ్రూట్స్‌, హోం ఐసొలేషన్‌ కిట్ల పంపిణీ 

  ‘ఎమ్మెల్యే హెల్పింగ్‌ హ్యాండ్‌' వాట్సాప్‌ గ్రూపుల ఏర్పాటు

  ధైర్యం చెబుతూ భరోసా కల్పిస్తున్న ఎమ్మెల్యే 

  కరోనా విజేతలు ప్లాస్మాదానం చేసేలా అవగాహన

ఎల్బీనగర్‌ : కరోనా బాధితులకు ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంవ్యాప్తంగా కరోనా సోకి దవాఖానలు, నివాసిత ప్రాంతాల్లో, ఐసొలేషన్‌లో ఉంటున్న బాధితులకు బాసటగా నిలుస్తున్నారు.  ఇందుకోసం ‘ఎమ్మెల్యే హెల్పింగ్‌ హ్యాండ్‌' పేరిట వాట్సాప్‌ గ్రూప్‌ను తయారుచేశారు. దీనిద్వారా ఎప్పటికప్పుడు సుమారు 500ల మంది బాధితుల ఆరోగ్య సమాచారం తెలుసుకుంటూ వైద్యుల ద్వారా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే వారికి ఫోన్‌ చేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. వారు త్వరగా కోలుకునేందుకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం అందించే కరోనా కిట్లతోపాటు జయచంద్రారెడ్డి చారిటబుల్‌ ట్రస్టు ద్వారా తన సొంత ఖర్చుతో డ్రై ఫ్రూట్స్‌, కరోనా ఐసొలేషన్‌ కిట్‌ను అందిస్తున్నారు. తన నివాసంలో స్వయంగా డ్రైఫ్రూట్స్‌ను, మందుల కిట్‌ను ప్యాకింగ్‌ చేయిస్తున్నారు. 

మరో రెండురోజుల్లో ఎమ్మెల్యే హోం ఐసొలేషన్‌ పూర్తి..

కరోనా ప్రబలుతున్న సమయంలో ప్రజల రక్షణ, అభివృద్ధి కోసం నియోజకవర్గంవ్యాప్తంగా పలు కార్యక్రమాలతో బిజీగా గడిపిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఇటీవలే కరోనా సోకింది. మరో రెండు రోజుల్లో ఎమ్మెల్యే తన 14 రోజుల హోం ఐసొలేషన్‌ పూర్తి చేసుకోనున్నారు. 

ప్లాస్మాదానం చేసేలా అవగాహన..

కరోనా విజేతలు ప్లాస్మా దానం చేసేలా అవగాహన కల్పించారు, 15 మందిని సిద్ధం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే వాట్సాప్‌ గ్రూపులోని కొందరు ప్లాస్మాదానం చేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా కోలుకున్న తర్వాత తన కుటుంబసభ్యులతో కలిసి ప్లాస్మాదానం చేయనున్నారు. 


కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నాం. వారికి ధైర్యం చెబుతూ భరోసా కల్పిస్తున్నాం. నియోజకవర్గంలోని కరోనా బాధితుల కోసం వాట్సాప్‌ గ్రూపుల ద్వారా నిత్యం వారి యోగక్షేమాలను తెలుసుకుంటున్నాం. ప్రతి కుటుంబానికి డ్రైఫ్రూట్స్‌ బాక్స్‌, కొవిడ్‌ ఐసొలేషన్‌ కిట్‌ అందిస్తున్నాం. త్వరలోనే జయచంద్రారెడ్డి ట్రస్టు ద్వారా ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేపడుతాం. కరోనా నుంచి చాలామంది ధైర్యంగా వైద్య సేవలు పొందుతూ రికవరీ అవుతున్నారు. మనోధైర్యంతో ఉండి కరోనాను జయించాలి. మా కుటుంబ సభ్యులు కరోనాను జయించారు. మరో రెండు రోజుల్లో నా హోం ఐసోలేషన్‌ కూడా పూర్తవుతుంది.  

- సుధీర్‌రెడ్డి ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే