ఆదివారం 06 డిసెంబర్ 2020
Rangareddy - Aug 31, 2020 , 23:13:25

ముంబైలో కలిశారు.. హైదరాబాద్‌లో హతమార్చారు..!

ముంబైలో కలిశారు.. హైదరాబాద్‌లో హతమార్చారు..!

చేవెళ్ల హత్యోదంతం మిస్టరీని ఛేదించిన పోలీసులు

శంషాబాద్‌, ఆగస్టు 31: పేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.. కట్టుకున్న వాడిని, కన్నపిల్లలను వదిలేసి ప్రియుడికోసం ముంబై చేరుకుంది. సహజీవనం చేసింది. పెండ్లి చేసుకొమ్మని పట్టుబట్టింది. ప్రియుడు ఎట్టకేలకు వదిలించుకోవాలని పథకం వేశాడు. విమానంలో నగరానికి తీసుకువచ్చాడు. మిత్రుడితో కలిసి హతమార్చారు. వివస్త్రను చేసి పరారయ్యారు. గత మార్చి నెలలో నగర శివారులో సంచలనం రేపిన ఈ మిస్టరీని చేవెళ్ల పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు సోమవారం శంషాబాద్‌లో డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టానికి చెందిన జాకీర్‌ అక్తర్‌(24) ముంబైలో నివాసముంటూ బట్టల వ్యాపారం చేసేవాడు. కాగా సిక్కిం రాష్ట్రంకు చెందిన దావా పస్సి షర్పా(37) అనే వివాహితతో షేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. తరచుగా ఆమెతో మాట్లాడేవాడు. ఆమెకు భర్త ఇద్దరు సంతానం ఉన్నారు. గత జనవరి మాసంలో ఆమె వద్దకు వెళ్లిన అక్తర్‌ తన వెంట ముంబైకి తీసుకువచ్చాడు. ఆమె జాకీర్‌తో సహజీవనం సాగించింది. ఎట్టకేలకు నీ కోసం నా కుటుంబాన్ని వదులుకొని వచ్చాను.. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. జాకీర్‌ ససేమిరా అన్నాడు. చివరికి ఎలాగైన ఆమెను వదిలించుకోవాలని అనుకున్నాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన  మిత్రుడు అక్తర్‌ బారి(24) బీటెక్‌ ఇంటర్షిప్‌ కోర్సు హాస్టల్‌లో ఉంటూ చదివేవాడు. అతనికి విషయం తెలుపగా హైదరాబాద్‌ తీసుకురమ్మన్నాడు. జాకీర్‌ గత మార్చి 16న ఆమెతో విమానంలో ముంబై నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగారు. అక్కడ వీరి కోసం వేచి ఉన్న జాకీర్‌ మిత్రుడు బారి ముగ్గురు కలిసి అద్దె కారులో చేవెళ్ల వైపు బయలుదేరారు. మీర్జగూడకు వెళ్లాకా.. తాడుతో ఉరివేసి హతమార్చారు. వివస్త్రను చేసి తంగడపల్లి బ్రిడ్జి వద్ద మృతదేశాన్ని పడేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న చేవెళ్ల పోలీసులు సీసీ పుటేజీ, ఇతర ఆధారాలతో కేసు దర్యాప్తు చేపట్టారు. గత మార్చిలో హత్య అనంతరం అక్తర్‌ బారిని పట్టుకున్నారు. అనంతరం జాకీర్‌ అక్తర్‌ను పట్టుకొని విచారించారు. ఇద్దరు నేరం ఒప్పుకోవడంతో రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ పేర్కొన్నారు. మిస్టరీని చాకచక్యంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.