శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Sep 06, 2020 , 00:38:05

మార్కెట్‌ కమిటీలకు మహర్దశ

మార్కెట్‌ కమిటీలకు మహర్దశ

ప్రభుత్వ ప్రత్యేక జీవో 376 జారీ

పంట కొనుగోళ్లకు ప్రభుత్వ అనుమతి

మార్క్‌ఫెడ్‌, ఐకేపీ,  పీఏసీఏస్‌ మాదిరిగానే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి : వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మంచి ఆదాయం మార్గంగా మారనుంది. మార్కెట్‌ల చరిత్రలోనే మునుపు ఎన్నడూ లేని విధంగా పాలకవర్గాల చేతికి పంట కొనుగోళ్ల బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవో 376ను జారీ చేసింది. ఇప్పటికే రైతులు పండించిన పంట దిగుబడులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగా మంచి ఆదాయం రానుందని పాలకవర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలోని షాద్‌నగర్‌, సర్దార్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, శంకర్‌పల్లి, ఆమనగల్‌, నార్సింగి, చేవెళ్ల, మహేశ్వరం మండలాల్లో ఎనిమిది మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 26 గోదాంలు ఉన్నాయి. పాతవి 11 గోదాంల సామర్థ్యం 13,400 మెట్రిక్‌ టన్నులుండగా, కొత్తవి 15 గోదాంల సామర్థ్యం 62,500 మెట్రిక్‌ టన్నులు ఉంది. ఏటా మార్కెట్‌ కమిటీల ఆదాయం రూ. 9.18కోట్లు వస్తుంది. ప్రస్తుతం జారీ చేసిన జీవోతో  మార్కెట్‌ కమిటీలు మరింత బలోపేతం కానున్నాయి. 

గోదాంల ఆదాయం ఇలా...

జిల్లాలోని 26 గోదాంలతో భారీ ఆదాయం సమకూరుతున్నది. ప్రతి నెలా అన్ని గోదాంలకు కలిపి రూ. 8.81లక్షలు వస్తున్నది. వీటిలో ఆరు గోదాంలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. పాత గోదాంలలో చేవెళ్ల, సర్దార్‌నగర్‌, షాద్‌నగర్‌, మొయినాబాద్‌, కొత్తవాటిలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలో గోదాంలు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో నాలుగు కూరగాయల మార్కెట్లు, రెండు పశువుల సంతలున్నాయి. కూరగాయల మార్కెట్‌లు చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, శంకర్‌పల్లిలోఉన్నాయి. 

వివిధ రకాల పంటల కొనుగోలు..

జిల్లాలో పండించే అన్ని రకాల పంటల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటివరకు పంటల కొనుగోళ్లకు కావాల్సిన వసతులు, మార్కెట్‌లలో చేపట్టిన పంట కొనుగోళ్లపై ఒక్కశాతం పన్ను ఆదాయం వచ్చేంది. అలాగే చెక్‌పోస్టుల ద్వారా వచ్చే ఆదాయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఇకపై నేరుగా పంట కొనుగోళ్లను చేపట్టనుండడంతో అదనంగా ఆదాయం సమకూరనుంది. క్వింటాల్‌కు రూ. 30 చొప్పున ఆదాయం ఇవ్వడంతో వేల క్వింటాళ్ల పంట దిగుబడులను కొనుగోలు చేసే ఆవకాశం ఉంది. పండించే ప్రధాన పంటల్లో వరి, పత్తి, కందులు, జొన్న, మక్కజొన్న, కూరగాయ పంటల కొనుగోళ్లకు ఆవకాశం ఉంది. వరి, పత్తి, కంది కొనుగోలుకు మార్కెట్‌ కమిటీలు ఆసక్తి చూపిస్తున్నాయి. 

మరిన్ని కొనుగోలు కేంద్రాలు..

మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో పంటల దిగుబడులను కొనుగోలు చేస్తే మరిన్ని కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. మార్క్‌ఫెడ్‌, ఐకేపీ, సహకార సంఘాల మాదిరిగానే మార్కెట్‌ కమిటీలు మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. దీంతో రైతులు సులభంగా పంట దిగుబడులను అమ్ముకునే ఆవకాశం ఉంటుంది. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. జిల్లాలోని 8 మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే స్థానికంగానే పంటలు అమ్ముకునే అవకాశం ఉంటుంది. పంట దిగుబడులను దూర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉండదు. దీంతో రైతులకు రవాణా చార్జీల భారం కూడా తగ్గుతుంది. పంటల కొనుగోళ్లకు పోటీతత్వం ఏర్పడడంతో రైతులకు మేలు జరుగుతుంది. ఇకపై మార్కెట్‌ కమిటీల పాలకవర్గాల పనితీరు పూర్తిగా మారిపోనున్నది. వరి పంట కొనుగోలు కేంద్రాలను అమనగల్‌, సర్దార్‌నగర్‌లలో, కంది పంట కొనుగోలు కేంద్రాలను ఆమనగల్‌, శంకర్‌పల్లి, షాద్‌నగర్‌లలో, పత్తి పంట కొనుగోలు కేంద్రాల కోసం జిల్లాలో 15 జిన్నింగ్‌ మిల్లులు గుర్తించారు. ఈ ఏడాది పత్తి పంట 1,03,320 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఒక హెక్టారుకు 20 క్వింటాళ్ల చొప్పున జిల్లాలో ఈ ఏడాది 20లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 

వికాకాబాద్‌ జిల్లాలో పది మార్కెట్‌ కమిటీలు..

 రైతుల నుంచి నేరుగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ధాన్యం కొనుగోలు చేపట్టనుండడంతో మార్కెట్‌లు ఆర్థికంగా లాభపడనున్నాయి. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు గల గోదాములు అద్దెకు ఇచ్చి ఆదాయం పెంపొందించుకుంటుండగా, ఈ కొనుగోళ్లతో మరింత మేలు చేకూరనుంది. వికారాబాద్‌ జిల్లా పరిధిలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌, కులకచర్ల, మర్పల్లి, బషీరాబాద్‌, కోట్‌పల్లి, ధారూర్‌, నవాబుపేట మొత్తం పది మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో నవంబర్‌ మొదటివారంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఉంచడానికి అవసరమైన గోదాములు మార్కెట్లకు ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 14 గోదాములు వ్యవసాయ మార్కెట్‌లకు ఉన్నాయి. వాటిలో 40వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉంచడానికి సరిపడా గోదాములు ఉండడంతో వాటిని పౌర సరఫరాల శాఖ వారికి అద్దెకు ఇచ్చారు. వాటిలో ధాన్యం, కస్టమ్‌ మిల్లింగ్‌ తర్వాత బియ్యం ఉంచడానికి పౌర సరఫరాల శాఖ వారు వాడుతున్నారు. ఈసారి నుంచి ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌లతోపాటు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టనున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి జిల్లాలో పెద్ద ఎత్తున వరి సాగు చేపట్టారు. ఈసారి జిల్లాలో 74,431 ఎకరాలలో వరి సాగు చేపట్టారు. సాధారణ సాగుతో పోలిస్తే వానకాలంలో జిల్లాలో 200 శాతం పైగా అధిక విస్తీర్ణంలో వరి సాగు చేయబడింది. దీంతో రాబోయే దిగుబడులను అంచనా వేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మరిన్ని అదనపు కేంద్రాల ఏర్పాటు జరగనుండగా అందుకు మార్కెట్‌ కమిటీలకు అనుమతులు ఇవ్వనున్నారు.  

వన్‌ నేషన్‌.. వన్‌ మార్కెట్‌..

మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో పంట దిగుబడులు కొనుగోలు చేసేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము. రైతులు పండించిన పంట దిగుబడులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘వన్‌ నేషన్‌..వన్‌ మార్కెట్‌'ను అమలులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం మార్కెట్‌లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సరిపడా గోదాంలున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతుల నుంచి పంట దిగుబడులు సేకరిస్తాం. దీంతో మార్కెట్‌ కమిటీలకు అదనంగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.  

-ఛాయాదేవి, రంగారెడ్డిజిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి