మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Aug 13, 2020 , 00:15:59

లాజిస్టిక్‌ పార్కు రెడీ

లాజిస్టిక్‌ పార్కు రెడీ

బాటసింగారంలో సకల హంగులతో ఏర్పాటు

త్వరలోనే ముహూర్తం ఖరారుచేయనున్న హెచ్‌ఎండీఏ

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు

తెలంగాణను ట్రాన్స్‌పోర్టు హబ్‌గా.. నగరాన్ని సరుకు రవాణా కేంద్రంగా మార్చాలనే  ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్‌ పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, రాష్ట్రానికి లాభసాటిగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నది. నగరంలోకి ట్రాన్స్‌పోర్టు వాహనాలు రాకుండా.. నగర శివారు ప్రాంతాల్లోనే లోడ్‌, అన్‌లోడ్‌ చేసుకునేలా లాజిస్టిక్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా నిర్మించిన బాటసింగారంలోని లాజిస్టిక్‌పార్కు సకల హంగులతో ముస్తాబై ప్రారంభానికి సిద్ధమైంది.

అబ్దుల్లాపూర్‌మెట్‌  : నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం గ్రామంలో హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) నిర్మిస్తున్న లాజిస్టిక్‌ పార్కు (ట్రక్కు టెర్మినల్స్‌) నిర్మాణ పనులు పూర్తయ్యాయి. నగరంలో రవాణా వ్యవహరాలను నిర్వహించే సంస్థలను ఇక్కడికి రప్పించాలనే భావనతో, ట్రక్కులు, భారీ వాహనాలు ఇక  ముందు నగరంలోకి రాకుండ ఉండాలని, ట్రాఫిక్‌ సమస్య, అక్రమ పార్కింగ్‌, కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అతిపెద్ద లాజిస్టిక్‌ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. హైదరాబాద్‌ మహానగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ ట్రక్‌ పార్కుల అవసరాన్ని గుర్తించిన హెచ్‌ఎండీఏ శివారు ప్రాంతంలోనే నిర్మించాలని నిర్ణయించింది. ఆగస్టు 2010లో హెచ్‌ఎండీఏ ఈ ట్రక్‌పార్కును బాటసింగారంలో ఏర్పాటు చేసేందుకు పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌(పీపీపీ) విధానంలో టెండర్లను ఖరారు చేసింది. వీటి నిర్మాణాన్ని రెండేండ్లలో పూర్తి చేయాలని గడువు విధించగా.. ప్రస్తుతం పను లు చివరి దశకు చేరుకున్నాయి.

సకల హంగులతో ఏర్పాటు 

విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో.. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు 7కి.మీ.ల దూరంలోని బాటసింగారం గ్రామంలో 40 ఎకరాల విస్తీర్ణం, రూ.35 కోట్ల అంచనా వ్యయంతో అతిపెద్ద ట్రక్‌ పార్కు నిర్మించారు. 

భారీ వాహనాల రాకపోకలు 

ప్రస్తుతం నగరంలో ప్రతిరోజు 32వేల ట్రాన్స్‌పోర్టు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కనీసం ఒక లక్ష పై చిలుకు టన్నుల బరువుల వస్తువులను ఎగుమతి, దిగుమతి చేస్తున్నాయి. కనీసంగా 10 లక్షల చ.అ.ల విస్తీర్ణలో గోదాం, 10వేల వాహనాలు పార్కింగ్‌లో ఉం టున్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న హెచ్‌ఎండీఏ నగర శివారులో, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంగా జాతీయ, రాష్ట్రీయ రహదారులకు అనుసంధానంగా ట్రక్‌ పార్కును ఏర్పాటు చేసింది. త్వరలో ఈ లాజిస్టిక్‌ పార్కును ప్రారంభిచనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ట్రక్‌ పార్కుతో.. యువతకు ఉపాధి

ట్రక్‌ పార్కులో స్థానిక, పరిసర గ్రామాల యువతకు ఉపాధి కల్పించామని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం సుమారు వంద మంది పనిచేస్తున్నారని, అందులో 80 శాతం స్థానికులకే అవకాశం కల్పించామని తెలిపారు. దీంతో ఎన్నో రోజులుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తమకు ట్రక్‌ పార్కు వల్ల పని దొరికిందని యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభం తర్వాత మరింత మంది యువతీ, యువకులకు ఉపాధి కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.

లాజిస్టిక్‌ పార్కులో ఏర్పాట్లు..

* 500 ట్రక్కులకు పార్కింగ్‌ సౌకర్యం

* 2లక్షల చ.అ.(చదరపు అడుగులు) గోదాం నిర్మాణం

* 10 వేల మెట్రిక్‌ టన్నుల కోల్డ్‌స్టోరేజ్‌ సామర్ధ్యం, నిర్వాహణ కోసం కార్యాలయ సముదాయం

* 10వేల చ.అ విస్తీర్ణంలో ఆటో మొబైల్‌ సేవా కేంద్రాలు

* 10 వేల చ.అ. విస్తీర్ణంలో వాహన పరీక్షా కేంద్రం

* 200 మంది విశ్రాంతి తీసుకునేందుకు రెస్టారెంట్స్‌, దాబాలు

* 5వేల చ.అ. స్థలంలో సీఎన్‌జీతో కలిపి పెట్రోల్‌ బంక్‌ లేదా ఒక ఇంధన కేంద్రం

* 2500 చ.అ. విస్తీర్ణంలో పరిపాలన, ఇతర అధికారిక సంస్థ భవనం

* 2వేల చ.అ.ల విస్తీర్ణంలో ఎలక్ట్రానిక్‌ వే బ్రిడ్జి

* 1500 చ.అ. స్థలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం