శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Aug 13, 2020 , 00:33:01

అభివృద్ధి పథంలో ఎల్బీనగర్‌

అభివృద్ధి పథంలో ఎల్బీనగర్‌

ఎస్‌ఆర్‌డీపీతో సరికొత్త అందాలు 

ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ 

చెరువుల సుందరీకరణ

థీమ్‌ పార్కులతో కొత్త శోభ 

మూడు మతాలకు అధునాతన శ్మశానవాటికలు

సుందరీకరణతో మురిసిపోనున్న మూసీ 

ఆటోనగర్‌లో అధునాతన బస్‌బే

సకల హంగులు సమకూర్చుకుంటున్న తూర్పు ప్రాంతం

ఎల్బీనగర్‌: అద్భుతమైన ఫ్లైఓవర్లు.. మణిహారమైన మెట్రో.. ఆహ్లాదాన్ని పంచే చెరువులు, మనసుకు ఆనందాన్ని ఇచ్చే థీమ్‌ పార్కులు... ఇలా సకల హంగులు సమకూర్చుకుంటూ.. ప్రగతికి దిక్సూచిగా నిలుస్తున్నది ఎల్బీనగర్‌. నగరానికి ముఖద్వారమైన జాతీయ రహదారి.. అంతర్జాతీయ హంగులతో ముస్తాబవుతున్నది. అధునాతన బస్‌బే, సుందర మూసీతో నూతన శోభ సంతరించుకుంటున్నది. మొత్తానికి ఈ తూర్పు ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి.  

ప్రగతి పథంలో..

ఎల్బీనగర్‌ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ చిక్కులు తప్పించేందుకు ఎస్‌ఆర్‌డీపీ కిందవంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో కొన్ని అందుబాటులో రాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. నగరానికి ముఖద్వారంగా ఉన్న జాతీయ రహదారిపై పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు నుంచి చింతలకుంట చెక్‌పోస్టు వరకు అధునాతన రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. చెరువుల సుందరీకరణ పనులతో పాటు అందమైన పార్కు లు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. త్వరలోనే కొత్త థీమ్‌ పార్కులూ అందుబాటులోకి రానున్నాయి. అలాగే మూసీ నూతనంగా సొబగులద్దుకుంటున్నది. ఫతుల్లగూడలో మూడు మతాల కోసం ఆరు ఎకరాల్లో అంతర్జాతీ య ప్రమాణాలతో శ్మశానవాటికలను నిర్మిస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్యల మధ్య ఉన్న గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డును కోహెడలోని 180ఎకరాల విశాలమైన ప్రాంగణంలోకి తరలించనున్నారు.  

రూ. 448 కోట్ల ప్యాకేజీతో..

ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-2లో భాగంగా నియోజకవర్గంలో రూ. 448కోట్ల అంచనా వ్యయంతో 14అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఇప్పటికే ఆరు పనులు పూర్తయ్యాయి. రింగ్‌రోడ్డు చౌరస్తాలో ఎడమ వైపు ఫ్లై ఓవర్‌, కామినేని నుంచి ఎల్బీనగర్‌ వైపు కుడి, ఎడమ పై వంతెనలు, చింతలకుంట, ఎల్బీనగర్‌ అండర్‌పాస్‌లు, బైరామల్‌గూడ కుడివైపు ఫ్లైఓవర్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎల్బీనగర్‌ కుడి, బైరామల్‌గూడ ఎడమ ైఫ్లైఓవర్లు, నాగోలు చౌరస్తా వద్ద వంతెన పనులు చకచకా సాగుతున్నాయి. 

జాతీయ రహదారికి మరింత శోభ..

ఇప్పటికే ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో సుందరంగా మారుతున్న ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు ప్రాంతానికి మరింత శోభ తెచ్చేలా జాతీయ రహదారికి సరికొత్త హంగులద్దుతున్నారు.  పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు చౌరస్తా నుంచి చింతలకుంట చెక్‌పోస్టు వరకు రూ.2.50 కోట్లతో జాతీయ రహదారి, సర్వీస్‌రోడ్లను,  రోడ్డు చివరి ప్రాంతాలను సుందరంగా మారుస్తున్నారు. రహదారి పక్కనే సైక్లింగ్‌ట్రాక్‌, ప్రయాణికులు కూర్చునేందుకు బెంచీలు, ల్యాప్‌టాప్‌, ఫోన్లు, విద్యుత్‌ కార్ల కోసం చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. 

చెరువుల సుందరీకరణ..

చెరువులు అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. బండ్‌తో పాటు వాకింగ్‌ ట్రాక్‌లు, పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చెరువుల వద్ద వాచ్‌ టవర్లు, దోమలు వృద్ధి చెందకుండా డ్రోన్‌ల ద్వారా మందుల పిచికారీ, ఫాగింగ్‌ చేపడుతున్నారు. మరో మూడు థీమ్‌ పార్కులు నిర్మించనున్నారు. 

అంతర్జాతీయ ప్రమాణాలతో బస్‌బే..

ఆటోనగర్‌లో త్వరలోనే బస్‌బే నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. హరిణ వనస్థలి వద్ద రూ.18కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. 24 స్టాపులతో ఏసీ, నాన్‌ ఏసీ బస్‌ షెల్టర్లను నిర్మిస్తారు. 

మూసీకి కొత్త అందాలు..

మూసీకి పూర్వ వైభవం తేవాలన్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్యే, మూసీ తీర ప్రాం తం అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నది ప్రక్షాళన పనులు జోరందుకున్నాయి. నాగోలు నుంచి లంగర్‌హౌస్‌ వరకు పనులు వేగంగా సాగుతున్నాయి. పీర్జాదిగూడ- ఫతుల్లగూడల మధ్య మరో కొత్త వంతెన కూడా రాబోతున్నది. నాగోలు రేడియల్‌ రోడ్డు, వరంగల్‌ జాతీయ రహదారిని కలిపే 120 అడుగుల రహదారిని నిర్మిస్తున్నారు.  భవిష్యత్‌లో మరిన్ని ప్రాజెక్టులతో ఎల్బీనగర్‌ దశ పూర్తిగా మారిపోనున్నది. 

రూపురేఖలు మారుస్తున్నాం

ఎల్బీనగర్‌ నియోజకవర్గం రూపురేఖలు మారుస్తున్నాం. జాతీయ రహదారితో పాటు  సాగర్‌రోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్డులో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు చౌరస్తాలో, చింతలకుంట వద్ద అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు, కామినేని జంక్షన్‌లో రెండు పై వంతెనలు, బైరామల్‌గూడలో మరో ఫ్లై ఓవర్‌ నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. జాతీయ రహదారిని అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దుతున్నాం. ఆటోనగర్‌లో అధునాతన బస్‌బే నిర్మించనున్నాం. ఫతుల్లగూడలో మూడు మతాలకు ఆధునిక హంగులతో శ్మశాన వాటికలు నిర్మిస్తున్నాం. మూసీని సుందరీకరిస్తున్నాం. చెరువులను ఆహ్లాదకరంగా మారుస్తున్నాం. థీమ్‌ పార్కులను నిర్మిస్తున్నాం.

 - ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ ఛైర్మన్‌ 

దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి