శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Aug 14, 2020 , 00:36:58

కొండకల్‌ కోచ్‌తో వేలాది మందికి ఉద్యోగాలు

కొండకల్‌ కోచ్‌తో వేలాది మందికి ఉద్యోగాలు

ఆదిబట్లలో ఇప్పటికే విమానాల విడిభాగాల తయారీ

మెట్రో కోచ్‌లు ఇక్కడే తయారుకావాలి.. స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ 

ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ 

రంగారెడ్డి జిల్లాలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన

పాల్గొన్న మంత్రులు హరీశ్‌రావు, సబితారెడ్డి, ఎంపీలు రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌: రాష్ట్రంలో పలు అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో ఇప్పటికే విమానాలు, హెలిక్యాప్టర్‌లు, ట్రాక్టర్లు, బస్సుల విడిభాగాలు తయారు అవుతుండగా, ఇప్పుడు రైల్వేకోచ్‌ నిర్మాణం చేసుకుంటున్నామని అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలోని మేధా సర్వోడ్రైవ్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో రైల్వే ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఇండియన్‌ రైల్వే రూ.30వేల కోట్ల పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచే మెట్రో కోచ్‌లు, లోకోలు ఉత్పత్తి అయ్యే విధంగా ఎదుగాలని ఆకాంక్షించారు. తెలంగాణ బిడ్డ యుగేందర్‌ 1984లో స్థాపించిన మేధా కంపెనీ దినదినాభివృద్ధి చెంది నేడు రైల్వే కోచ్‌లు, లోకోలు తయారు చేసే సంస్థగా ఎదుగడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. హైదరాబాద్‌లో మెట్రో కోచ్‌లను కొరియా కంపెనీ తయారు చేసిందని, రానున్న కాలంలో ఇక్కడి నుంచే కోచ్‌లు తయారు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో కొండకల్‌కు కోచ్‌ పరిశ్రమ రావడంతో ప్రత్యక్షంగా వెయ్యిమందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు వస్తే ఢిల్లీ, వారణాసి మాదిరిగా తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవచ్చన్నారు. గంటలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, రెండు గంటల్లో విజయవాడకు, నాలుగు గంటల్లో బెంగళూరుకు చేరుకోవచ్చన్నారు. కొండకల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 15-18 నెలల సమయంలో మొదటి యూనిట్‌ ద్వారా మొదటి కోచ్‌ నిర్మాణం పూర్తి చేసి సీఎం కేసీఆర్‌చే ప్రారంభించుకుందామన్నారు. కాలుష్యం తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్‌ వాహనాలు పెంచేవిధంగా కృషి చేస్తుందన్నారు. 106 ఎకరాలలో కొండకల్‌, వెలిమల గ్రామాల్లో ఏర్పాటవుతున్న ఈ ఫ్యాక్టరీ ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కంపెనీ యాజమాన్యాన్ని కేటీఆర్‌ కోరారు. చేవెళ్ల, మెదక్‌ ఎంపీల నిధులతో ఇక్కడి స్థానిక నిరుద్యోగులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద శిక్షణ ఇప్పించాలని సూచించారు. కొండకల్‌లో ఐలా ఏర్పాటుతో పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల, మెదక్‌ పార్లమెంట్‌ సభ్యులు డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు తీగల అనితారెడ్డి, మంజుశ్రీ, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, వైస్‌ చైర్మన్‌ వెంకటనర్సింహారెడ్డి, మేధా కంపెనీ ఎండీ కశ్యప్‌రెడ్డి, ఈడీ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్లు అమయ్‌కుమార్‌, హన్మంత్‌రావు, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఇంద్రారెడ్డి ట్రస్టు చైర్మన్‌ పి. కార్తీక్‌రెడ్డి, రాష్ట్ర విద్యా, మౌలిక వసతుల చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, నాయకులు శుభప్రద్‌పటేల్‌, ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

నాలుగేండ్లలో రూ. వెయ్యి కోట్ల ఖర్చు

మేధా రైల్వేకోచ్‌ ప్యాక్టరీకి వచ్చే నాలుగేండ్లలో రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నట్లు కంపెనీ ఈడీ అశోక్‌రెడ్డి తెలిపారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఇందులో 1500 రైల్వేకోచ్‌లు, 500 లోకోమోటివ్‌ ఇంజన్‌లు తయారు చేస్తామన్నారు.

-అశోక్‌రెడ్డి, మేధా కంపెనీ ఈడీ

నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఏర్పాటు

మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు ఎంపీ నిధుల నుంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. తన పార్లమెంట్‌ పరిధిని ఇండస్ట్రియల్‌ హబ్‌గా మార్చిన మంత్రి కేటీఆర్‌కు చేవెళ్ల లోక్‌సభ యువత తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొన్న షాబాద్‌లో వెల్స్‌పన్‌, నేడు కొండకల్‌లో రైల్వేకోచ్‌తో పాటు మరో నాలుగు పెద్ద పరిశ్రమలకు షాబాద్‌ రెడ్‌కార్పెట్‌ వేయబోతున్నట్లు పేర్కొన్నారు. తన ఎంపీ నిధుల నుంచి నైపుణ్యాభివృద్ధిపై స్థానిక యువతకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు.

పరిశ్రమలు ఏర్పాటవ్వడం సంతోషంగా ఉంది

చేవెళ్ల నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుండటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఇక్కడి పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. నగరానికి అతి దగ్గరలో ఉన్న చేవెళ్లలో కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా 84 గ్రామాల రైతులకు గుదిబండగా మారిన 111జీవోను సడలించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఆలూర్‌ గ్రామంలో 1200 ఎకరాల భూమి ఉందని, అక్కడ కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు.