శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rangareddy - Sep 27, 2020 , 01:35:15

ఐటీ ఖజానా.. ప్రగతికి చిరునామా..

ఐటీ ఖజానా..  ప్రగతికి చిరునామా..

రూ.5800 కోట్లతో పనులు

ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారంగా అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు

కరోనా నిగ్గుతేల్చే ‘టిమ్స్‌'.. మణిహారంగా తీగల వంతెన 

పుష్కలంగా తాగునీరు.. అద్దంలా మెరిసిపోతున్న రహదారులు 

ఎమ్మెల్యే చొరవతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న శేరిలింగంపల్లి 

ఐటీకి పుట్టినిల్లుగా.. లక్షలాది మంది ఉపాధికి నెలవైన శేరిలింగంపల్లి.. అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతున్నది. పచ్చదనం, పరిశుభ్రత, తళుక్కుమంటున్న రోడ్లు.. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, పుష్కలంగా తాగునీరు.. ఇలా ఆరేండ్లలోనే అద్భుత ప్రగతి సాధించి.. ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కృషి,  పట్టుదలతో సమస్యలు  ఒక్కొక్కటిగా పరిష్కారమవుతూ.. అన్నింటా బెస్ట్‌ అనిపించుకుంటూ.. సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నది. 

గత పాలనలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండగా..  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఆరేండ్లలోనే ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. ఐటీ కేంద్రం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ , మంత్రి కేటీఆర్‌ల ప్రత్యేక దృష్టి , స్థానిక  ఎమ్మెల్యే గాంధీ నిరంతర కృషి ఫలితంగా ప్రగతికి చిరునామాగా మారింది.

ఎస్‌ఆర్‌డీపీతో.. 

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో  సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తోడ్పాటుతో ఇప్పటికే నియోజకవర్గంలో రూ. 5,800 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఎస్‌ఆర్‌డీపీ కింద అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రూ. 2,691 కోట్ల రూపాయలతో  వేర్వేరు ప్రాంతాల్లో ఆరు పై వంతెనలు, అండర్‌ పాస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవే కాకుండా మరికొన్ని ఫ్లై ఓవర్ల  (మల్కం చెరువు నుంచి షేక్‌ పేట వరకూ, కొత్తగూడ, శిల్పా లే అవుట్‌ నుంచి గచ్చిబౌలి వరకూ) పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రపంచ ప్రతిష్టాత్మకమైన దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి సైతం ఇక్కడే ఉన్నది. దీన్ని శుక్రవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. అలాగే కరోనాను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా  గచ్చిబౌలిలోని 1500 పడకల టిమ్స్‌ దవాఖానను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఒక్కో డివిజన్‌కు రూ. 100 కోట్లు.. 

గత పాలనలో బల్దియాలోని డివిజన్‌లకు గరిష్ఠంగా  కేవలం రూ. 10 కోట్ల నిధులను మాత్రమే కేటాయించి.. మమ అనిపించుకోగా,  ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని  ఒక్కో డివిజన్‌కు రూ. 100  కోట్ల మేర నిధులు కేటాయిస్తూ.. మౌలిక వసతులు, అభివృద్ధి పనులు విస్తృతంగా చేపడుతున్నది. ఎమ్మెల్యే గాంధీ ప్రత్యేక చొరవతో ఏండ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన లింక్‌ రోడ్లకు మహర్దశ పట్టింది.  అంతేకాదు  తన సొంత నిధులతో చెరువులను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే... రూ. 123 కోట్ల నిధులతో సుందరీకరణ పనులు చేయిస్తున్నారు. తాగునీటి ఇబ్బందులను  తొలగించేందుకు  మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా నియోజకవర్గంలో 23 భారీ ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్ల విస్తరణ ద్వారా ఇంటింటికీ తాగునీటి కలను నిజం చేస్తున్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా..

సీఎం కేసీఆర్‌ , మంత్రి కేటీఆర్‌ల సూచనలతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపడుతున్నాం. ఇప్పటికే నియోజకవర్గంలో రూ. 5,800 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. ఐటీ కేంద్రం సింహభాగం నెలవై ఉన్న మా నియోజకవర్గం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల తోడ్పాటును ప్రజలు ఎన్నటికీ మరువబోరు. నియోజకవర్గవ్యాప్తంగా మౌలిక వసతులైన రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్‌ వంటి వసతులు కల్పిస్తూ... వ్యూహాత్మక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. దైనందిన కార్యకలాపాలతో ఒత్తిడికి గురయ్యే ప్రజలకు ప్రశాంతత ఆహ్లాదాన్ని పంచేలా చెరువులను పచ్చదనంతో సుందరీకరించి అందుబాటులోకి తీసుకువస్తాం. 

- అరెకపూడి గాంధీ,

ప్రభుత్వ విప్‌ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే