శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Jun 25, 2020 , 01:04:50

కష్టకాలంలోనూ పెట్టుబడి సాయం

కష్టకాలంలోనూ పెట్టుబడి సాయం

హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

ప్రతిపక్షాల ఆరోపణలు పటా పంచలు

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్న రైతులు

కందుకూరు: ఒకవైపు కరోనా సంక్షోభం, మరోవైపు ఆర్థిక మాంద్యం , రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నప్పటికీ సీఎం కేసీఆర్‌ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. నియంత్రిత సాగుకు ఊతమిస్తూ, విపక్షాల ఆరోపణలు, నిందలను పటాపంచలు చేస్తూ రైతుబంధు అమలు చేస్తున్నారు. దీంతో రైతులకు ఆర్థ్ధిక భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 50శాతం మందికి పైగా రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. దీంతో రైతులు ధైర్యంగా సాగుకు సిద్ధమవుతున్నారు. డివిజన్‌ పరిధిలోని దాదాపుగా 47వేల మంది రైతులు ఉండగా వీరందరికీ దశల వారీగా అకౌంట్‌లో  ఎకరాకు రూ.5వేల చొప్పున జమవుతున్నాయి. రైతులకు సకాలంలో పంట పెట్టుబడి సాయం అందుతుండడంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.మహేశ్వరం డివిజన్‌ పరిధిలోని కందుకూరు, కడ్తాల్‌, ఆమనగల్లు, మహేశ్వరం, బాలాపూర్‌  మండలాల్లోని 24, 549 మంది రైతులకు ఇప్పటి వరకు 16 కోట్ల 8లక్షల 37వేల 312 రూపాయలకు పైగా వారి ఖాతాల్లో జమ అయ్యాయి.

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..

ఎవుసం చేయాలంటే ఇప్పుడు రంది లేదు. కేసీఆర్‌ సారు ఏడాదికి రెండు పంటలకు పెట్టుబడి కింద ఇచ్చే పైసలు ఎకరాకు రూ. 5వేల చొప్పున నా ఖాతాలో జమ చేశారు. ఒకప్పుడు ఎవుసం చేయాలంటే పెట్టుబడి పైసల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే వాళ్లం. ప్రస్తుతం ఆ తిప్పలు తప్పాయి. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.            - స్వప్న, మహిళా రైతు