మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Aug 12, 2020 , 00:09:04

రైతు వేదికలతో సంఘటితం

రైతు వేదికలతో సంఘటితం

సంక్షేమ పథకాల్లో రాష్ట్రం నంబర్‌ వన్‌

రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

మహేశ్వరంలో రైతువేదిక భవనం పరిశీలన

 మహేశ్వరం: సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలుస్తున్నదని రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.  మండలంలో నిర్మాణం పూర్తి చేసుకున్న రైతువేదికను రంగారెడ్డి జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను సంఘటితం చేయడం కోసమే రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్‌ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.  తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను  పక్క రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో  కూడా అన్నదాతకు ఇబ్బంది కలుగకుండా వారి వద్దకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.  పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిండడంతోపాటు, పంటను ఎప్పుడు మార్కెట్‌కు తరలించడం తదితర సమాచారాన్ని ఈ వేదికల్లో చర్చించుటకు వీలుంటుందన్నారు. ఈ వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు శిక్షణ ఇస్తారని వెల్లడించారు. ఈ వేదికలను రైతులు సద్వినియోగం చేసుకొని పండించిన పంటలతో లాభాలు సాధించాలని సూచించారు. త్వరలో గోదాములు, కూరగాయలకు కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతు బీమాకు రూ. 1200 కోట్లు  బీమా సంస్థకు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్‌రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్‌, ఎంపీడీవో నర్సింహులు, జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సురసాని వరలక్ష్మీసురేందర్‌రెడ్డి, సహకార బ్యాంక్‌ చైర్మన్‌ మంచెపాండు యాదవ్‌, వైస్‌చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి,  రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, డివిజన్‌ వ్యవసాయ సంచాలకులు సుజాత, మండల వ్యవసాయాధికారి కోటేశ్వర్‌రెడ్డి,  సర్పంచ్‌ కాసుల సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

‘పట్టుదల, క్రమశిక్షణతో సాధించవచ్చు’

చిక్కడపల్లి : కృషి పట్టుదల, క్రమశిక్షణతో చదివితే సివిల్స్‌ సాధించవచ్చని ఆలిండియా సివిల్స్‌ 98 ర్యాంకర్‌ మేగ స్వరూప్‌ అన్నారు. మంగళవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని రామ్‌ సుధీర్స్‌ ఐఏఎస్‌ అకాడమి ఆధ్వర్యంలో సివిల్స్‌ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో మెళకువలు, సలహాలు సూచనలు అందించారు. ప్రణాళికాబద్ధంగా చదివితే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని మేగ స్వరూప్‌ అన్నారు. తమ సంస్థకు 76, 98, 117 ర్యాంకులు వచ్చాయని సంస్థ డైరెక్టర్‌ రామ్‌ సుధీర్‌ తెలిపారు.