సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Aug 20, 2020 , 23:56:01

క్యాన్సర్‌ను ఆరంభంలో గుర్తిస్తే.. చికిత్స సులభం

క్యాన్సర్‌ను ఆరంభంలో గుర్తిస్తే.. చికిత్స సులభం

10న గ్రేస్‌ క్యాన్సర్‌ రన్‌ 3వ ఎడిషన్‌  

ప్రపంచవ్యాప్తంగా వర్చువల్‌గా రేస్‌    

ఆవిష్కరించిన సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ 

శేరిలింగంపల్లి : క్యాన్సర్‌ వ్యాధిని ఆరంభంలోనే గుర్తిస్తే చికిత్స అందించడం సులభతరం అవుతుందని, తద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అన్నారు. గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గ్రేస్‌ క్యాన్సర్‌ రన్‌ 3వ ఎడిషన్‌ వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ పట్ల అవగాహన కల్పించేందుకు అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రేస్‌ క్యాన్సర్‌ రన్‌ 3వ ఎడిషన్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. నగరానికి చెందిన గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహిస్తున్నారని అన్నారు. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చని సూచించారు. క్యాన్సర్‌ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. రాష్ట్ర మాజీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌ మిశ్రా మాట్లాడుతూ కొవిడ్‌ నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్‌ పేషెంట్లు చికిత్స తీసుకునేందుకు భయపడుతున్నారని, అలాంటి వారిలో ధైర్యం నింపేందుకు ఈ రేస్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రేస్‌ డైరెక్టర్‌ నిరంజ్‌ రాజ్‌ మాట్లాడుతూ ‘బీట్‌ క్యాన్సర్‌, బియాండ్‌ కొవిడ్‌ 19’ పేరిట ప్రపంచ వ్యాప్తంగా వర్చువల్‌గా ఈ రేస్‌ను నిర్వహిస్తున్నామని,  5కె, 10కె, 21.1కె (హాఫ్‌ మారథాన్‌) విభాగాల్లో ఔత్సాహికులు పాల్గొనవచ్చని, వారికి ఇ-బిబ్‌లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, మాజీ ఐజీ సుజాత రావు, మాజీ మిస్‌ ఇండియా, ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి, గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక సీఈవో డాక్టర్‌ చిన్నబాబు సుంకవల్లి పాల్గొన్నారు.