బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Aug 19, 2020 , 00:31:51

ఒంటరి మహిళ కనపడితే.. స్నాచింగ్‌

ఒంటరి మహిళ కనపడితే.. స్నాచింగ్‌

నిందితుడు అరెస్ట్‌ 

శంషాబాద్‌ : ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్‌ చేసుకుని.. చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నిందితుడిని శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అశోక్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడకు చెందిన ముడావత్‌ రవి నాయక్‌ (32)  సరూర్‌నగర్‌లో ఉంటూ హోం గార్డుగా పనిచేసేవాడు. గతంలో మాదాపూర్‌ పీఎస్‌లో పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసై.. స్నాచింగ్‌లకు పాల్పడటంతో ఉద్యోగం నుంచి తొలగించారు. స్నాచింగ్‌ కేసులో జైలు నుంచి విడుదల అయిన తర్వాత ఓ మహిళతో కలిసి శంషాబాద్‌ ప్రాంతంలో స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. కాగా.... మంగళవారం కిషన్‌గూడ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదస్థితిలో కనపడిన రవినాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో స్నాచింగ్‌ల విషయం బయటపడింది. నిందితుడి నుంచి  7 తులాల బంగారం,  6 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని మహిళ పరారీలో ఉన్నదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నది.