ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Jul 28, 2020 , 22:59:15

ధైర్యంతో జయించాను..

ధైర్యంతో జయించాను..

‘కరోనా విజేత’ బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి

బడంగ్‌పేట : మొదట మా బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌కు పాజిటివ్‌ వచ్చింది. సమస్యలపై సమీక్ష జరిపే క్రమంలో ఆ వ్యక్తితో మాట్లాడి ఉండటంతో ముందుజాగ్రత్తగా నేను, మా వారు నర్సింహారెడ్డి ఇద్దరం కరోనా పరీక్షలు చేయించుకున్నాం. ఇద్దరికీ నెగిటివ్‌ అని చెప్పిన వైద్యులు సాయంత్రం మావారికి ఫోన్‌ చేసి నాకు ఒక్కదానికి పాజిటివ్‌ వచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా వణికిపోయాను. ఒళ్లంతా చెమటలు పట్టాయి. వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్‌కు ఫోన్‌ చేసి సలహాలు తీసుకున్నాను. మా ఇంట్లోనే ఓ గదిలో క్వారంటైన్‌లో ఉన్నాను. ముందు ఎలాంటి సింప్టమ్స్‌ లేవు. మూడు రోజుల తర్వాత జలుబు, గొంతునొప్పి వచ్చాయి. కొన్నిరోజులు బాగా ఇబ్బంది పడ్డాను. డాక్టర్‌ సూచించిన మందులు వాడాను. అరగంటకు ఒకసారి వేడినీళ్లు తప్పనిసరిగా తీసుకున్నాను. వేడినీళ్లలో నిమ్మరసం కలుపుకొని తాగాను. తరచుగా కషాయం తాగాను. మూడు రోజుల తర్వాత తగ్గాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. పిల్లలు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం చాలా బాధగా అనిపించింది. మొదటి మూడురోజులు అన్నిపనులు నేనే చేసుకున్నాను. ఆ తర్వాత మా తోడికోడళ్లు, చెల్లెలు వంట చేసి పంపించారు. ఇంట్లో వారందరికీ పరీక్ష చేయిస్తే నెగెటివ్‌ వచ్చింది. వైద్యుల సూచనలు పాటిస్తూనే యోగా, వ్యాయామం చేయడంతోపాటు సంగీతం విన్నాను. మహిళల సమస్యలపై కొన్ని కథలు రాశాను. పాజిటివ్‌ వచ్చిన తర్వాత మంత్రి సబితారెడ్డి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆందోళన పడొద్దన్నారు. మంత్రి ఫోన్‌తో కొండంత ధైర్యం వచ్చింది. స్నేహితులు, బంధువులు సైతం మనోధైర్యం కల్పించారు.

17రోజుల్లో నెగెటివ్‌..

నేను మొదట భయపడినా ఆ తర్వాత ధైర్యం తెచ్చుకున్నాను. ఆవిరి పట్టడం, కషాయంతోపాటు విటమిన్‌ ‘సి’ ఉండే పండ్లు తిన్నాను. గుడ్డు, మాంసం తీసుకున్నాను. పాజిటివ్‌ వచ్చిందని భయపడొద్దు. హోంక్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తూ..పౌష్టికాహారం తీసుకుంటే కొన్నిరోజుల్లోనే కరోనా నుంచి బయటపడొచ్చు. నేను 17 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండి కరోనాను జయించాను. క్వారంటైన్‌ తర్వాత పరీక్ష చేయించుకున్నాను. నెగెటివ్‌ వచ్చింది. ధైర్యంగా ఉండటంతోనే త్వరగా కోలుకున్నాను. నా ఆరోగ్యం మెరుగవ్వాలని కోరుకున్న, నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.