ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Aug 18, 2020 , 01:14:31

కోకాపేటలో భారీ లే అవుట్‌

కోకాపేటలో భారీ లే అవుట్‌

513 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న హెచ్‌ఎండీఏ

రూ.167 కోట్లతో మౌలిక వసతుల కల్పన

ఇప్పటికే టెండర్లకు ఆహ్వానం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అంతర్జాతీయ స్థాయి హంగులతో కోకాపేటలో హెచ్‌ఎండీఏ భారీ లే అవుట్‌ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నది. ఆకాశహార్మ్యాల నిర్మాణాలకు వీలుగా భారీ వెంచర్‌ను ఏర్పాటు చేయబోతున్నది. బహుళ జాతి కంపెనీలు, డెవలపర్లను దృష్టిలో ఉంచుకుని లే అవుట్‌ను అభివృద్ధి చేస్తున్నది. మొత్తం 513 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో విశాలమైన రోడ్లు, నీటి వసతి, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, స్ట్రీట్‌ లైటింగ్‌ తదితర మౌలిక వసతులను ఈ లే అవుట్‌లో కల్పించనున్నది. ఇందుకు సంబంధించి రూ.167.45 కోట్ల అంచనతో హెచ్‌ఎండీఏ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ నెల 26న టెండర్‌ గడువు ముగియనుంది. రాబోయే 18 నెలల్లోగా పూర్తిస్థాయి అంతర్జాతీయ హంగులతో లే అవుట్‌ను తీర్చిదిద్దనున్నారు.

బహుళ అంతస్థుల భవనాలు..

హెచ్‌ఎండీఏ కోకాపేట భూములకు ప్రత్యేకత ఉంది. ఈ భూములు గండిపేట జలాశయం తీరంలో ఉండడం, మరీ ముఖ్యంగా ఔటర్‌ రింగు రోడ్డుకు కేవలం 400మీటర్ల దూరంలో ఈ భూములు ఉన్నాయి. మరోవైపు ఆకాశ హార్మ్యాల (బహుళ అంతస్థుల భవనాలు) నిర్మాణానికి అనువైన ప్రాంతం.. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌కు అతి సమీపంగా ఈ భూములు ఉండటంతో బహుళ జాతి కంపెనీలు, డెవలపర్ల దృష్టి వీటిపై పడింది. దీంతో 2006 సంవత్సరంలో నిర్వహించిన వేలం కంటే అత్యధికంగా ఈ సారి డిమాండ్‌ వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాతో లే అవుట్‌ను అభివృద్ధి చేస్తున్నారు హెచ్‌ఎండీఏ అధికారులు. ఈ లే అవుట్‌లో ఆకాశ హార్మ్యాలకు వీలుగా 45, 36 మీడర్ల వెడల్పుతో విశాలమైన రోడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక సివరేజీ సిస్టం, వాటర్‌ సైప్లె, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. హై రైజ్‌ బిల్డింగ్‌ (ఆకాశహార్మ్యాలు), మల్టీపర్పస్‌ భవనాలకు వీలుగా మౌలిక వసతులను సమకూర్చనున్నారు. అంతేకాకుండా ల్యాండ్‌ స్కేపింగ్‌ (పచ్చదనం), సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుట్‌పాత్‌, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ ఏర్పాటు చేయనున్నారు.  

భారీ అంచనాలు..

రాజేంద్రనగర్‌ మండల పరిధిలోని కోకాపేటలో సర్వే నంబరు 239, 240 లోని సుమారు 135 ఎకరాలను తొలివిడుతగా వేలం వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సెక్టార్‌-1లో 105.3 ఎకరాలు, సెక్టార్‌-2లో 29.6 ఎకరాలుగా విభజించారు. రెండు ఎకరాల నుంచి 12 ఎకరాల మేర 14 ప్లాట్లుగా విభజించారు. ఇందులో 7 నుంచి 10 ఎకరాల మేర ప్లాట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎకరాల మేర విభజించిన ఈ ప్లాట్లను ఈ యాక్షన్‌ ద్వారా హెచ్‌ఎండీఏ వేలం వేయనున్నది. వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా లే అవుట్‌ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు.