ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Sep 08, 2020 , 00:50:15

హైటెక్‌ నారు..లాభాలు జోరు

హైటెక్‌ నారు..లాభాలు జోరు

షాబాద్‌ : కూరగాయలు సాగు చేస్తున్న రైతులను ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో హైటెక్‌ నర్సరీలను ఏర్పాటు చేసి, సబ్సిడీపై వివిధ రకాల కూరగాయల నారు సరఫరా చేస్తున్నది. 2019-20 సంవత్సరానికి గాను రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 6,93,900 కూరగాయల నారు మొక్కలను అందించగా.. ఇందులో 4,22,700 లక్షలు 54.4 ఎకరాలకు 48 మంది రైతులకు సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ, జీడిమెట్ల నుంచి సరఫరా చేశారు. అదే విధంగా 2,71,200 కూరగాయల నారు మొక్కలను 35.75 ఎకరాలకు 26 మంది రైతులకు సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ ములుగు నుంచి అందించినట్టు ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. 2020-21 సంవత్సరానికి గాను డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ 10లక్షల నారు మొక్కలు సరఫరా చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 

సాంకేతిక సాగుతో లాభాలు...

  సాంకేతిక సాగు పద్ధతులు సాగు రూపురేఖలను మార్చేస్తున్నాయి. ముఖ్యంగా కూరగాయల నారు ఎంత ఆరోగ్యంగా ఉంటే దిగుబడులు అంత నాణ్యంగా ఉంటాయి. గతంలో బోరుబావుల వద్ద మడుల్లో నారు పెంచి అందివచ్చిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకునేవారు. రైతులకు ఈ విధానంలో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ఆరోగ్యవంతమైన నారు మొక్కలను ఉత్పత్తి చేయటానికి షెడ్‌నెట్లను ఉపయోగిస్తున్నది. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగును ప్రోత్సహించేందుకుగాను హైదరాబాద్‌లోని జీడిమెట్ల సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ, సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ ములుగు, సిద్దిపేట జిల్లాలలో హైటెక్‌ నర్సరీలు ఏర్పాటు చేసి పూర్తిగా ఆటోమేషన్‌ సీడింగ్‌ మెషీన్‌ ద్వారా నారు ఉత్పత్తి చేస్తున్నారు. షెడ్‌నెట్లలో, మడుల్లో పెంచే నారు మొక్కలతో పోలిస్తే ఇవి ఆరోగ్యకరంగా, ధృడంగా ఉండి, చీడ పురుగుల నుండి తట్టుకునే శక్తి ఉంటుంది. ఇందులో టమాటా, వంగ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, క్యాప్సికమ్‌ మొదలైన నారు మొక్కలు పెంచి రైతులకు అందిస్తున్నారు. 

సబ్సిడీపై సరఫరా

ఒక్కో రైతు 2.5 ఎకరాల వరకు కూరగాయల నారు పొందవచ్చు. టమాటా, వంగ నారు ఒక ఎకరానికి 8వేల మొక్కలు అవసరం కాగా.. రూపాయికి ఒక మొక్క చొప్పున రూ. 8వేలు ఖర్చు వస్తుంది. ఈ పంటలకు 81 శాతం సబ్సిడీ వస్తుంది.. ఇందులో రూ. 6500 ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ పోగా మిగిలిన రూ. 1500 రైతు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, క్యాప్సికమ్‌ నారు ఒక ఎకరానికి 6400 మొక్కల నారు అవసరం ఉండగా& రూపాయి 25పైసలు చొప్పున రూ. 8వేలు ఖర్చు అవుతుంది. ఈ పంటలకు 84 శాతం సబ్సిడీ వస్తుంది. ఇందులో రూ. 6720 సబ్సిడీ పోగా రూ. 1280 రైతు చెల్లించాలి. దీంతో పాటు పంటలకు ఎరువులు వేసేందుకు గాను రైతుల ఖాతాల్లో రూ. 1000 జమచేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

నారుకోసం డీడీ తీసి ఇవ్వాలి..

కూరగాయల నారు తీసుకోవాలనుకున్న రైతులు సబ్సిడీపోను మిగిలిన మొత్తాన్ని  ADH,సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ, జీడిమెట్ల/ADH,సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ, ములుగు పేర్ల మీద డీడీ కట్టవలసి ఉంటుంది. దరఖాస్తు ఫారానికి డీడీని జతపరిచి దగ్గర్లో ఉన్న ఉద్యానవన శాఖ కార్యాలయంలో అందజేయాలి. దరఖాస్తు ఇచ్చిన నెల రోజులకు నారు మొక్కలు సంబంధిత రైతుకు సరఫరా చేస్తారు. 

రైతులు సద్వినియోగం చేసుకోవాలి 

సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న నారు మొక్కలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గతంలో షెడ్‌నెట్లలో,మడుల్లో పోసి పెంచే నారుకంటే నూతన విధానంలో హైటెక్‌ నర్సరీల్లో పెంచుతున్న నారుతో పంట దిగుబడులు కూడా అధికంగా వస్తాయి. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 162.5 ఎకరాల్లో 10లక్షల నారుమొక్కలు సరఫరా చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. సబ్సిడీపై జీడిమెట్ల, ములుగు ప్రాంతాల నుంచి నారు తీసుకువచ్చి రైతులకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.   

-డాక్టర్‌ సునందారాణి, 

రంగారెడ్డిజిల్లా ఉద్యానవనశాఖ అధికారి