ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Sep 29, 2020 , 00:18:02

హేమంత్‌ హత్య కేసులో.. దర్యాప్తు ముమ్మరం

హేమంత్‌ హత్య కేసులో.. దర్యాప్తు ముమ్మరం

శేరిలింగంపల్లి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన.. హేమంత్‌ కుమార్‌ కిడ్నాప్‌, హత్య కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నా యి. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న హేమంత్‌ కిడ్నాప్‌, హత్యా పథకాన్ని నెల రోజుల ముందుగానే రచించినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తును ము మ్మరం చేశారు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారులు హేమంత్‌ మామ దొంతిరెడ్డి లక్ష్మారెడ్డి, అత్త అర్చన, యుగంధర్‌రెడ్డిలను కలుపుకుని మొత్తం 14 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే.

    ఈ కేసులో హేమంత్‌ హత్యకు నెలరోజుల క్రితమే .. మృతుడి భార్య అవం తి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చనలు, మేనమామ యుగంధర్‌ రెడ్డిలు పథకం రచించి, చర్చించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. యుగంధర్‌ రెడ్డికి స్నేహితులైన కొల్లూరు బుచ్చియాదవ్‌, వట్టినాగులపల్లికి చెందిన ఎరుకల కృష్ణలు హేమంత్‌ హత్యకు పలువురిని సంప్రదించినట్లు పోలీసుల విచారణ లో తేలింది. యుగంధర్‌రెడ్డి.. తన బావ పడుతున్న బాధను చూడలేక హేమంత్‌ను హత్య చేసేందుకు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చేందుకు పలువురిని సంప్రదించి... చివరిగా బిచ్చుయాదవ్‌, ఎరుకల కృష్ణ, వట్టినాగులపల్లి పాషాలతో కలిసి కిడ్నాప్‌, హత్య ఘటనలకు పాల్పడినటు తెలిసింది.

    ఈ హత్య కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్ట్‌ చేయగా..  పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ఎరుకల కృష్ణ, షేక్‌ పాషాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎరుకుల కృష్ణతో గచ్చిబౌలి పోలీసులు హేమంత్‌ కిడ్నాప్‌, హత్య సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. గోపన్‌పల్లి తండాలో కారులోంచి దిగి పారిపోతున్న హేమంత్‌ను యుగంధర్‌ రెడ్డి వెంబడించి పట్టుకుని  పిడిగుద్దులు గుద్దుతూ కారులో బలవంతంగా ఎక్కించాడు.. అక్కడి నుంచి వట్టినాగులపల్లి ఔటర్‌ సర్వీస్‌ రోడ్డు..  అటు నుంచి కొల్లూర్‌ వరకు ఔటర్‌ సర్వీస్‌ రోడ్డు .. అక్కడి నుంచి  ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై పటాన్‌చెరు వరకు వెళ్లి... అక్కడి నుంచి జహీరాబాద్‌, సంగారెడ్డి ప్రాంతంలో హేమంత్‌ మృతదేహాన్ని పడవేసిన ఘటన ప్రాంతం వరకు ఎరుకల కృష్ణతో పోలీసులు పరిశీలించి.. పలు విషయాలు నిర్ధారణ చేసుకున్నట్లు తెలుస్తున్నది. దీంతోపాటు హేమం త్‌ హత్యకు రచించిన పథకంలో వారు మిగతా ఎవరిని సంప్రదించారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.