బుధవారం 28 అక్టోబర్ 2020
Rangareddy - Sep 26, 2020 , 01:04:59

మామిడి రైతులకు చేయూత

మామిడి రైతులకు చేయూత

రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : జిల్లాలో మామిడి ఉత్పత్తి రైతులు సభ్యులుగా రైతు ఉత్పత్తి సంఘం (ఎఫ్‌,పీ.ఓ)లను ఏర్పాటు చేసి వారికి మామిడికాయల విలువ, ప్రాసెసింగ్‌ ఎగుమతులు తదితర సదుపాయాలు కల్పించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చనున్నట్లు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. కేంద్రప్రభుత్వ వ్యవసాయ ఎగుమతుల విధానాన్ని రంగారెడ్డి జిల్లాలో అమలుపై శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా మానిటరింగ్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సునంద, హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... జిల్లాలో ప్రతి ఏడాది 72,240 మెట్రిక్‌ టన్నుల మామిడికాయలు ఉత్పత్తి అవుతున్నట్లు చెప్పారు. సీజన్‌లో కిలో మామిడికాయకు రైతుకు కేవలం రూ.25కే లభిస్తుందన్నారు. కానీ మధ్య దళారికి ఇంకా ఎక్కువ మొత్త లభిస్తుందని చెప్పారు. ఈ సమస్యను నివారించేందుకు జిల్లాలోని ప్రతి రైతును సంఘటితం చేయడానికి ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌.పీ.ఓ)లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విధానంలో భాగంగా మామిడి, మిరప, పసుపు ఉత్పత్తులను గుర్తించి వీటికి సరైన ప్రాసెసింగ్‌, నిల్వలకు కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటు, ఎగుమతులు చేయడం ద్వారా మంచి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టనున్నారు.  జిల్లా పరిధిలోని మొయినాబాద్‌, ఫరూఖ్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, కేశంపేట్‌ మండలాలలో మామిడితోటలు అధికంగా ఉన్నాయన్నారు. జిల్లాలో మొత్తం ఏడు ఏఫ్‌పీఓలను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దారించగా ఇప్పటివరకు నాలుగు ఎఫ్‌పీఓలను రిజిస్ట్రేషన్‌ చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు 3033 ఎకరాల విస్తీర్ణం గల 1011మంది మామిడి రైతులు సభ్యులుగా నమోదయ్యారని తెలిపారు. వివరాలకోసం జిల్లా ఉద్యానవన అధికారులను సంప్రదించాలని సూచించారు.

అక్టోబర్‌ 5 నుంచి 12 వరకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ

 జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో అక్టోబర్‌ 5నుంచి 12వరకు 1-19 ఏండ్ల లోపు వారికి అల్బెండజోల్‌ డీ వార్మింగ్‌ మాత్రలను అందజేస్తున్నామని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో జాతీయ నులి పురుగు నిర్మూలన కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... కొవిడ్‌-19 భద్రతా మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని 19 ఏళ్లలోపువారికి వారి ఇండ్ల వద్దే సంబంధిత అంగన్‌వాడీ టీచర్ల ద్వారా డీ వార్మింగ్‌ మాత్రలను అందిస్తున్నామని తెలిపారు.  అల్బెండజోల్‌ మాత్రను ఇంటి బయటనే ఉండి వేయాలన్నారు.  అనారోగ్యంగా ఉన్న లేదా ఇతర మందులు వాడుతున్న పిల్లలు, కిశోరబాలలకు మాత్ర ఇవ్వకూడదని, ఏదైనా వైద్య సహాయం అవసరమైతే అత్యవసర వైద్య సహాయం కోసం 104 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను, అంబులెన్స్‌ సేవల కోసం 108 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
logo