బుధవారం 28 అక్టోబర్ 2020
Rangareddy - Sep 21, 2020 , 00:58:51

ప్రకృతి వైద్యానికి మంచిరోజులు

ప్రకృతి వైద్యానికి మంచిరోజులు

రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌

ఇబ్రహీంపట్నం మండలం తట్టిఖానాలో రామచంద్ర  ప్రకృతి ఆశ్రమాన్ని ప్రారంభించిన మంత్రి

ఇబ్రహీంపట్నం : భవిష్యత్తులో ప్రకృతి వైద్యానికి మంచిరోజులు రానున్నాయని, మనిషి ప్రకృతిని ఆస్వాదించడానికి ముందుకు రావాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం సమీపంలోని తట్టిఖానాలో గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్టాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామచంద్ర ప్రకృతి ఆశ్రమాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషిని ప్రకృతి మాత్రమే కాపాడుతుందని, ప్రకృతి ఎన్నో కోట్ల జీవరాశులను తమ ఒడిలో పెట్టుకుంటుందని, కాని మనిషి ఒక్కడే ప్రకృతిని ఆస్వాదించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి తరుణంలో గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ ప్రకృతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన పెంచడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇటీవల దేశాన్ని కుదిపివేసిన కరోనా సమయంలో కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఔషధ గుణాలున్న, ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాటితో కషాయం తయారు చేసుకుని తాగారని అన్నారు.  గతంలో కాలిపోయిన మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లను చూశామని.. అప్పుడు కరెంటు కోసం అధికారులను బతిమాలేవారమని, తెలంగాణ ఏర్పడిన తరువాత కరెంటుకు కొదవేలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో నాలుగువేల కోట్లతో పెద్దఎత్తున చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నామని, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కూడా మరిన్ని చెక్‌డ్యాంలు నిర్మిస్తామని అన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ దవాఖానను 100 పడకల దవాఖానగా మార్చాలని మంత్రిని కోరారు.   వర్షాలు లేక ఇబ్రహీంపట్నం పరిధిలో చెరువులు, కుంటలు నిండలేదని.. శివన్నగూడ ఎత్తిపోతల ద్వారా చెరువులు, కుంటలు నింపడానికి కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ చైర్మన్‌ గున్నా రాజేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి చందు, వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, కౌన్సిలర్లు నీలం శ్వేత బాలు, జెర్కోని బాలరాజు, భానుబాబు, నల్లబోలు మమత, రామచంద్ర ప్రకృతి వైద్యశాల వైద్యుడు రాంచందర్‌రావు పాల్గొన్నారు. 
logo