గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Sep 01, 2020 , 22:52:21

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ ప్రారంభం

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ ప్రారంభం

మంగళవారం నుంచి ప్రారంభమైన క్రయవిక్రయాలు

 ఎల్బీనగర్‌ : గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డు మల్లీ మంగళవారం నుంచి ప్రారంభమయ్యింది. మార్కెట్‌ యార్డులో క్రయవిక్రయాలు మొదలయ్యాయి. కరోనా నేపథ్యంలో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను బంద్‌చేసిన విషయం  తెలిసిందే. కాగా మార్కెట్‌ యార్డును కోహెడకు తరలించి వ్యాపారాలు చేయాలని మార్కెట్‌ కమిటీ అధికారులు తలచినప్పటికీ గడ్డిఅన్నారం మార్కెట్‌ కమీషన్‌ ఏజెంట్లు మాత్రం కోహెడ వెళ్లేది లేదంటూ కోర్టును ఆశ్రయించారు. గతంలో కోహెడలో తాత్కాలిక షెడ్లను వేసి వ్యాపారాలు ప్రారంభించగా అక్కడ గాలి వానకు షెడ్లు కూలి పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులు తాత్కాలిక షెడ్లలో వ్యాపారానికి తాము వ్యతిరేకమంటూ గళం విప్పి కోర్టును ఆశ్రయించారు. ఓ వైపు కోర్డులో వివాదం కోనసాగుతుండగానే కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ పాలకవర్గం, అధికారులు సెప్టెంబర్‌ 1న మార్కెట్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా బోసిపోయిన మార్కెట్‌ యార్డు తిరిగి ప్రారంభం కావడంతో పండ్ల రాశులతో కళకళలాడింది. మంగళవారం పండ్ల మార్కెట్‌యార్డుకు 28 లారీల్లో ఆపిల్స్‌ 18,578 బాక్స్‌లు, మోసంబీ 19 లారీలు, 22 డీసీఎంలలో 447 టన్నులు, గ్రేప్స్‌ ఒక లారీ , 7 బోలేరోల్లో 791 బాక్స్‌లు, గ్వావా 10 ఆటోల్లో 191 బాక్స్‌లు, మస్క్‌ మిలన్‌ 3 లారీలు, 5 డీసీఎంలలో 22 టన్నులు, ఆరెంజ్‌ 22 ఆటోల్లో 725 బాక్స్‌లు, పాపాయ 61 ఆటోల్లో 138 టన్నులు, పైనాపిల్‌ 6 లారీల్లో 49 టన్నులు, అనార్‌ 10 డీసీఎం, 35 బొలెరోల్లో 7,339 బాక్స్‌లు, 2,454 క్రేట్స్‌, సపోటా 1 డీసీఎంలో 15 బ్యాగ్స్‌, వాటర్‌మిలన్‌ 1 లారీ 9 డీసీఎంలలో 79 టన్నులు, దిగుమతి చేసుకునే పండ్లలో కివీ 3 లారీల్లో 1710 బాక్స్‌లు, డ్రాగన్‌ ఫ్రూట్‌ 1 లారీలో 501 బాక్స్‌లు మార్కెట్‌ యార్డుకు వచ్చాయి.