శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Aug 07, 2020 , 23:31:35

వేగంగా లింకురోడ్డు పనులు..

వేగంగా లింకురోడ్డు పనులు..

శేరిలింగంపల్లి:  శేరిలింగంపల్లి వెస్ట్‌జోన్‌ మసీద్‌బండలోని ప్రభుపాద లేఅవుట్‌ లింకురోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు, నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లింకురోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నది. యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తున్నది. హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌ఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో నగరంలో రూ. 270 కోట్ల భారీ వ్యయంతో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మసీదుబండ ప్రభుపాద లేఅవుట్‌ రాఘవేంద్ర కాలనీ హైటెన్షన్‌ లింకురోడ్డు నిర్మాణ పనులను వేగంగా అధికారులు చేపడుతున్నారు. మసీద్‌బండ ఆర్బర్‌ స్కూల్‌ రహదారి జంక్షన్‌ను దీనికి కలుపుతున్నారు. ఫలితంగా మసీద్‌బండ, ప్రభుపాద లేవుట్‌ కాలనీ, జేవీజీహిల్స్‌, రాజరాజేశ్వరి కాలనీలకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా మారనున్నది. మసీద్‌బండ గ్రామం నుంచి ప్రభుపాద లే అవుట్‌లో లగ్జర్‌ అపార్టుమెంట్‌ వరకు 100 అడుగుల రోడ్డు అందుబాటులో ఉంది. హైటెన్షన్‌ లేన్‌ కింద ఈ రోడ్డును ఏర్పాటు చేసినప్పటికీ లగ్జర్‌ అపార్టుమెంట్‌ తర్వాత ముగిసింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు మసీద్‌బండ ప్రభుత్వ పాఠశాల మీదుగా దాదాపు మూడు కిలోమీటర్లు తిరిగి ఆర్బర్‌ స్కూల్‌ జంక్షన్‌ కొండాపూర్‌కు వెళ్లాల్సి వచ్చేది. లగ్జర్‌ అపార్టుమెంట్‌ దగ్గర రోడ్డు ముగిసిన ప్రాంతం నుంచి ఆర్బర్‌ స్కూల్‌ జంక్షన్‌ వరకు హైటెన్షన్‌ లేన్‌ కింద కిలోమీటరు దూరం మాత్రమే. దీంతో హైటెన్షన్‌ లేన్‌ కింద ఉన్న సదరు ప్రైవేట్‌ స్థలం, జేవీజీ పార్క్‌ల మీదుగా ప్రస్తుతం కిలోమీటరు మేరకు లింకురోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఫలితంగా ప్రభుపాద లేఅవుట్‌ పరిసర ప్రాంతాల కాలనీలకు ఈ లింకురోడ్డు ప్రధాన రోడ్డుగా మారనున్నది.  

100 అడుగుల విస్తీర్ణంతో లింకు రోడ్డు..

మసీద్‌బండ గ్రామం, ప్రభుపాద లేఅవుట్‌  కాలనీల మీదుగా కొండాపూర్‌ ఆర్బర్‌ స్కూల్‌ జంక్షన్‌ వరకు ఈ లింకురోడ్డుకు తెలంగాణ ప్రభుత్వ హయాంలో గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌ఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత 10 రోజులుగా రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన హెచ్‌ఆర్‌డీసీఎల్‌ యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నది. 100 అడుగుల విస్తీర్ణంతో కిలోమీటరు మేరకు ఈ రహదారి నిర్మాణ పనులను శరవేగంగా అధికారులు పూర్తి చేస్తున్నారు. హైటెన్షన్‌ లేన్‌ కింద ఈ రోడ్డును సువిశాలంగా నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.