సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Sep 27, 2020 , 01:22:36

ఓటీఎస్‌తో వడ్డీ నుంచి విముక్తి

ఓటీఎస్‌తో వడ్డీ నుంచి విముక్తి

  మాదాపూర్‌ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న తాగునీటి బిల్లుల వల్ల అయ్యే వడ్డీ భారాన్ని వినియోగదారులపై మోపకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ (వన్‌ టైం సెటిల్‌మెంట్‌) విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఎన్నో నెలలుగా నీటి బిల్లులను చెల్లించని వినియోగదారులకు ఇదొక మంచి పరిణామం. ఇందుకోసం మొదట ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 15 వరకు పెండింగ్‌లో ఉన్న నీటి బకాయిలను చెల్లించాలని గడువు తేదీ విధించినప్పటికీ ప్రజల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం ఓటీఎస్‌ గడువు అక్టోబర్‌ చివరి వారం వరకు పెంచింది. కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచిన వినియోగదారులకు వడ్డీ నుంచి విముక్తి చేసేందుకు ఈ విధానాన్ని తీసుకురావడంతో 90 శాతం మంది వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని, ఓటీఎస్‌ విధానం ప్రభుత్వం కల్పించిన మంచి అవకాశమని ప్రతి ఒకరు సద్వినియోగం చేసుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. 

   బకాయిలు చెల్లించకుండా ఉంటే అయ్యే వడ్డీ .. 

 నీటి బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచడం వల్ల వాటర్‌ వర్క్స్‌ బోర్డ్‌ 1.5 చొప్పున ఏడాదికి 18 శాతం వడ్డీ వేస్తుంది. ఇలా రెండు సంవత్సరాలు వరకు పెండింగ్‌లో ఉంచినట్లయితే మొత్తం అసలు కంటే వడ్డీనే ఎక్కువ అవడంతో వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఓటీఎస్‌ విధానాన్ని సద్వినియోగం చేసుకొని ఇక మీదట నీటి బిల్లులను సకాలంలో చెల్లించినట్లయితే వడ్డీ బాధల నుంచి బయటపడవచ్చని అధికారులు చెబుతున్నారు.  చెల్లించని యెడల నీటి కనెక్షన్లు కట్‌ చేయాలని జలమండలి అధికారులు భావిస్తున్నారు.

శేరిలింగంపల్లిలో మొత్తం డివిజన్లు.. 

హఫీజ్‌పేట్‌లోని జలమండలి కార్యాలయం పరిధిలో మొత్తం 10 వార్డులు ఉండగా అందులో శేరిలింగంపల్లికి 7 వార్డులు, పటాన్‌చెరుకు 3 వార్డులు ఉన్నానయి. భారతినగర్‌ డివిజన్‌ పటాన్‌చెరు, శేరిలింగంపల్లికి చెందినది కావడంతో భారతినగర్‌ను కలుపుకొని మొత్తం 8 వార్డులలో మాత్రమే నీటి బిల్లులను వసూలు చేస్తున్నారు. పటాన్‌చెరుకు చెందిన మిగతా రెండు డివిజన్లలో నీటి కనెక్షన్లను ఉచితంగా అందివ్వాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు చేయడంతో ఉచితంగా నీటి సరఫరాను అందిస్తున్నారు. 

10 డివిన్‌లలో మొత్తం కనెక్షన్లు.. 

హఫీజ్‌పేట్‌ జలమండలి కార్యాలయంలో మొత్తం 69 వేల కనెక్షన్లు ఉండగా అందులో పటాన్‌చెరు, రామచంద్రాపురానికి చెందిన రెండు డివిజన్లలో 11 వేల ఉచిత కనెక్షన్లు ఉన్నాయి. పటాన్‌చెరు, శేరిలింగంపల్లికి సగభాగంలో ఉన్న భారతినగర్‌తో కలిపి మొత్తం 8 డివిజన్లను కలుపుకొని జూలై 31 డాటా ప్రకారం 58 వేల కనెక్షన్లు   ఉండగా వాటికి మాత్రమే నల్లా బిల్లులను వసూలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 58 వేల నల్లా కనెక్షన్లలో రెగ్యులర్‌గా బిల్లులు చెల్లించేవారు 30 వేల మంది కాగా బకాయిలు పెట్టేవారు 28 వేల మంది ఓటీఎస్‌ జాబితాకు చెందినవారు. 

బకాయిలు చెల్లించిన మొత్తం.. 

ఓటీఎస్‌లో భాగంగా బకాయిల జాబితాకు చేరిన 28 వేల మందిలో ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 25 వరకు 14వేల 500 మంది ఓటీఎస్‌ విధానాన్ని వినియోగించుకొని లబ్ధిపొందగా మిగత 13 వేల పై చిలుకు మంది వచ్చే నెలాఖరు వరకు ఎంత మంది బిల్లులను చెల్లిస్తారనేది వేచిచూడాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆగస్టు నెలలో రూ. 4.95 కోట్లు వసూలు కాగా సెప్టెంబర్‌ 1 నుంచి 15వ తేదీ వరకు రూ. 5.27 కోట్ల బకాయిలు వసూలయ్యాయి. దీంతో మొత్తం కలిపి రూ. 10.22 కోట్లు వసూలైనట్లు వాటర్‌వర్క్స్‌ అధికారులు తెలిపారు.                                                                                                      

వినియోగదారుల కోసం మొబైల్‌ వ్యాన్లు..

శేరిలింగంపల్లిలో నీటి బిల్లులను కట్టించుకునేందుకు జలమండలి అధికారులు మొత్తం మూడు మొబైల్‌ వ్యాన్లను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో తిరిగేలా చర్యలు   తీసుకుంటున్నారు.


              ఓటీఎస్‌ విధానాన్ని సద్వినియోగం చేసుకోండి 

నీటి బిల్లులు బకాయిలు ఉన్న వారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్‌ (వన్‌ టైం సెటిల్‌మెంట్‌) విధానాన్ని సద్వినియోగం చేసుకొని వడ్డీ నుంచి విముక్తి పొందండి.  చెల్లించలేని వారికి మాత్రం వడ్డీ ఎట్టి పరిస్థితుల్లో మాఫీ కాదు.  వచ్చే నెలాఖరు వరకు వేచి చూసి వాటర్‌ సరఫరాతో పాటు సీవరేజీని తొలగించేలా 

చర్యలు తీసుకుంటాం. బకాయిలు చెల్లించిన వారి వివరాలను 

ఎప్పటికప్పుడు పొందుపరిచి చెల్లించిన మొత్తాన్ని మరుసటి 

రోజు పూర్తి వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా చూసుకోవచ్చు. 

       - రాజశేఖర్‌, జలమండలి జనరల్‌ మేనేజర్‌