శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Sep 07, 2020 , 01:48:37

ఫార్మాసిటీ ఏర్పాటుకు అందరూ సహకరించాలి

ఫార్మాసిటీ ఏర్పాటుకు అందరూ సహకరించాలి

భూములు కోల్పోయిన వారికి ఇంటికో ఉద్యోగం, ఇంటి స్థలం

ఎవరికీ అన్యాయం జరుగకుండా పరిహారం ఇస్తున్నాం

 ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం : ఫార్మాసిటీ భూసేకరణలో రైతులకు అన్యాయం జరుగకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి గతంలో ఎక్కడా ఇవ్వని విధంగా అత్యుత్తమ పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొంతమంది రైతులను గందరగోళానికి గురిచేయడంతో అవార్డు జారీచేసే పరిస్థితి తలెత్తిందని, దీనివల్ల రైతులకు అన్యాయం జరుగకుండా మంత్రి సబితారెడ్డి సహకారంతో ప్రభుత్వాన్ని ఒప్పించగలిగామని తెలిపారు. పట్టాభూములకు ఎకరాకు రూ.16లక్షల, అంతకంటే విలువైన ఇంటి స్థలాలను అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే భూములిచ్చిన అసైన్డ్‌, పట్టా, భూదాన్‌ రైతులకు కూడా ఎకరాకు 120 గజాల ఇంటిస్థలం ఇవ్వడానికి మంత్రి కేటీఆర్‌ చొరువ తీసుకుని ముఖ్యమంత్రిని ఒప్పించారని వివరించారు. ఇప్పటికే అవార్డు జారీచేసిన వెయ్యి ఎకరాలకు కూడా ఇదే తరహా పరిహారం ఇవ్వనున్నామని చెప్పారు. పదిహేను రోజులలోగా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబడుతాయని ఆయన తెలిపారు. తప్పుడు మాటలు చెప్పేవారి మాటలు విని రైతులు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.