ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Sep 06, 2020 , 00:38:02

మెగా సీడ్‌ పార్కు ఏర్పాటుకు కృషి

మెగా సీడ్‌ పార్కు ఏర్పాటుకు కృషి

ప్రతిపాదనలు సిద్ధం చేయండి...  దిశ సమావేశంలో అధికారులకు  ఎంపీ రంజిత్‌రెడ్డి ఆదేశంవికారాబాద్‌ రూరల్‌ : జిల్లాలో సాధ్యమైనంత త్వరగా మెగా సీడ్‌పార్కు ఏర్పాటు చేసేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సూచించారు. శనివారం వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన దిశా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా సీడ్‌పార్కును జిల్లాలోని తాండూరులో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు దేశంలో మూడు సీడ్‌పార్కులు ఉన్నాయని, వికారాబాద్‌ జిల్లాలో కంది పరిశోధన స్థానం సమీపంలో మెగా సీడ్‌పార్కుకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తే అందుకు కావాల్సిన నిధులను నాబార్డు నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తామన్నారు. దేశంలో నాలుగో సీడ్‌పార్కును తాండూరులో ఏర్పాటు చేసేందుకు వ్యవసాయాధికారులు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి ఒక డీపీఆర్‌ను తయారు చేసి ఈ నెల 14వ తేదీలోగా పంపాలన్నారు. దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. అలాగే పార్లమెంట్‌లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకపోయే ప్రయత్నం చేస్తానన్నారు. వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల స్థలంలో మెగా సీడ్‌పార్కు, విత్తనసెజ్‌ ఏర్పాటు చేస్తే అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. భారత్‌ దర్శన్‌ అనే స్కీమ్‌ ద్వారా టూరిజంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు, ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, ఆనంద్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.