శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 04, 2020 , 00:27:09

బుట్టలతో నృత్యం చేస్తూ..

బుట్టలతో నృత్యం చేస్తూ..

తండాల్లో ప్రారంభమైన తీజ్‌ ఉత్సవాలు

తొమ్మిది రోజుల పాటు వేడుకల నిర్వహణ

కందుకూరు: ప్రతి ఏడాది నిర్వహించే తీజ్‌ ఉత్సవాలు గిరిజన తండాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నది. వారి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నది. తొమ్మిది రోజుల పాటు యువతులు, కొత్తగా పళ్లైనా మహిళలు ఆడు తూ పాడుతూ నెత్తిన గోదుమ బుట్టలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ ఉత్సవాలు జరుపుకొంటారు. రాఖీ పౌర్ణమికి ముం దు వచ్చే అమావాస్య రోజున యువతులు తండాల సమీపంలోని పంటచేలనుంచి మట్టిని తీసుకువచ్చి వెదురుతో అల్లిన బుట్టల్లో వేసి గోదుమలు అలుకుతారు. ఈ గోదుమలు రాఖీ పౌర్ణమి పండుగ నాటికి మొలకలు వస్తాయి. ఆ మొలకలు ఎదిగిన విధంగా ఇల్లు అభివృద్ధి చెంది పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని, తండా ప్రజలు సుఖశాంతులతో ఉంటారని వారి నమ్మకం. ఈ ఉత్సవాలను యువతులు, పళ్లై అత్తారింటికి వెళ్లిన మహిళలు ప్రత్యేకంగా జరుపుకొంటారు. తీజ్‌ బుట్టలను తలపై పెట్టుకొని యువతులు చేసే నృత్యాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. కాగా రాఖీ పండుగ నుం చి తీజ్‌ ఉత్సవాలు ప్రారంభమై శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు నిర్వహించుకుంటారు. దీంతో తండాల్లో సందడిగా ఉంటుంది.


నృత్యాలతో వేడుకలు నిర్వహిస్తాం

గిరిజన యువతులు నిర్వహించే తీజ్‌ పం డుగకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిం ది. తొమ్మిది రోజుల పాటు తండాల్లో పండుగ వాతావరణం ఉంటుంది. మొలకలతో కూడిన బుట్టలను నెత్తిన పెట్టుకొని సంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేస్తాం. తీజ్‌ నిర్వహించడం వల్ల యువతులకు, తండాలకు మంచి జరుగుతుందని మాకు నమ్మకం.

- మంగ్లీ లచ్చానాయక్‌, పెద్దమ్మతండా

గిరిజనుల ప్రత్యేక పండుగ

తీజ్‌ పండుగను నిర్వహించడం గిరిజన యువతుల ఆచారం. తొమ్మిది రోజుల పాటు తండాల్లో ఉత్సాహంగా నిర్వహిస్తాం. తండా ల్లో గిరిజనులంతా ఏకమై నిర్వహిచడం సంతోషంగా ఉంటుంది. బుట్టలను నెత్తిన పెట్టుకొని నృత్యాలు చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన అనంతరం తీజ్‌ పండుగకు మరింత గుర్తింపు వచ్చింది.

- రజిత ప్రవీణ్‌నాయక్‌, సర్పంచ్‌, సార్లరావులపల్లి