ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Aug 20, 2020 , 00:45:21

జిల్లా దవాఖానలో కరోనా వైద్యం

జిల్లా దవాఖానలో కరోనా వైద్యం

100 ఆక్సిజన్‌ పడకలు, ఐసీయూ, ఐసొలేషన్‌ సేవలు

వైపు టెస్టులు.. మరో వైపు చికిత్స కొనసాగుతున్న ఓపీ

కొండాపూర్‌ : కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖలు మెరుగైన చర్యలు తీసుకుంటున్నాయి. పీహెచ్‌సీల్లో కొవిడ్‌ -19 పరీక్షలతో పాటు అక్కడే వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్‌ డివిజన్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో కరోనా చికిత్సను ప్రారంభించింది. ఇప్పటికే 100 పడకలకు ఆక్సిజన్‌ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోగా, 20 ఐసీయూ పడకలు, మరో 20 ఐసొలేషన్‌ పడకలను సిద్ధం చేశారు. కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న వారికి చికిత్సను సైతం అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా జిల్లా దవాఖానలో కరోనా వైద్యానికి చికిత్స అందిస్తుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కరోనా పరీక్షలు, వైద్యాన్ని అందిస్తూనే మరో వైపు ఔట్‌ పేషెంట్‌ విభాగాలను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ తెలిపారు. 

పెరిగిన టెస్టుల సంఖ్య...

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ -19 పరీక్షల సంఖ్యను పెంచారు. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు ప్రారంభించినప్పటి నుంచి పరీక్షల కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి నిర్వహిస్తున్నారు. గతంలో రోజుకు 25 నుంచి 30 మందికి పరీక్షలు చేయగా, ప్రస్తుతం వాటి సంఖ్య 100కు చేరింది. కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో రోజుకు 250 టెస్టులు చేస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దశరథ తెలిపారు. పరీక్షలు అయిన రోజే ఫలితాలను సైతం వెల్లడిస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హోం ఐసొలేషన్‌లో ఉంచాలా ?  లేదా? దవాఖానలో చేరాలా ? అనేది తెలియజేస్తున్నామని చెప్పారు. 

మెరుగైన సేవలందిస్తున్నాం

కరోనా పరీక్షలతో పాటు దవాఖానలో చేరుతున్న వారికి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నాం. కొవిడ్‌ పరీక్షలకు వచ్చే వారు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయడంతో పాటు వచ్చిన అందరికి టెస్టులు చేస్తున్నాం. ఇతర సమస్యలతో వచ్చే రోగులకు, కరోనా పరీక్షలకు వచ్చే వారి వల్ల ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇటు కరోనా సేవలతో పాటు అటు ఓపీ సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం. 

-డాక్టర్‌ దశరథ, 

రంగారెడ్డి జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌