గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 27, 2020 , 01:43:32

యుద్ధప్రాతిపదికన లింక్‌రోడ్ల నిర్మాణ పనులు

యుద్ధప్రాతిపదికన లింక్‌రోడ్ల నిర్మాణ పనులు

ప్రధాన రహదారుల కనెక్టివిటీతో తేలిక కానున్న ప్రయాణం 

నగరంలో ఐదు కారిడార్లలో కొనసాగుతున్న పనులు 

రూ.76.30 కోట్లు ఖర్చు చేస్తున్న హెచ్‌ఆర్‌డీసీ

శరవేగంగా నాగోల్‌ టూ పీర్జాదిగూడ లింక్‌రోడ్డు పనులు

ఎల్బీనగర్‌: నగరంలో ప్రధాన రోడ్లను కలుపుతూ నిర్మిస్తున్న కనెక్టివిటీ రోడ్ల పనులు యుద్ధప్రాతికదిన సాగుతున్నాయి. ప్రధాన రహదారుల్లో ఉన్న ట్రాఫిక్‌ కష్టాలను తొలగించేందుకు చేపట్టిన ఈ రోడ్ల నిర్మాణంతో ప్రయాణం ఇక తేలిక కానున్నది. రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఆర్‌డీసీ) ఐదు కారిడార్లలో రూ.76.30 కోట్లతో కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో ప్రధానంగా కారిడార్‌ 99లో నాగోలు నుంచి పీర్జాదిగూడను కలుపుతూ 120 ఫీట్ల రోడ్డు.. కారిడార్‌ 86 కింద ఉప్పల్‌ ఆదిత్య వైద్యశాల నుంచి బోడుప్పల్‌ను కలుపుతూ  రెండు కిలోమీటర్ల రోడ్డు.. కారిడార్‌ 138లో లంగర్‌హౌస్‌ నుంచి మణికొండ నుంచి నెక్నంపూర్‌ నుంచి హిమాయత్‌ సాగర్‌ వరకు.. కారిడార్‌ 66లో మణికొండ నుంచి బోరబండను కలిపేందుకు ఒక కిలోమీటరు.. కారిడార్‌ 12లో జేవీ హిల్స్‌ పార్కు నుంచి మజీద్‌బండ వరకు ఒక కిలోమీటరు రోడ్డును నిర్మిస్తున్నారు. 

యుద్ధప్రాతిపదికన 120ఫీట్ల రోడ్డు నిర్మాణం..  

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నాగోలు నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు గౌరెల్లి వరకు ఉన్న రేడియల్‌ రోడ్డులో బండ్లగూడ ఇందూ అరణ్య నుంచి ఫతుల్లాగూడ ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌ మీదుగా మూసీని దాటి పీర్జాదిగూడలోని వరంగల్‌ హైవేను అనుసంధానం చేస్తూ 120 ఫీట్ల రోడ్డును నిర్మిస్తున్నారు. ఓ వైపు అటవీ శాఖ ప్రహారీని ఆనుకుని మరోవైపు పచ్చదనం మధ్య అద్భుతంగా ఈ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో ఎల్బీనగర్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల ప్రాంతాలకు ఎంతో మేలు జరుగనున్నది. ఈ రోడ్డు కోసం ఫతుల్లాగూడ ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌లోని ఆపరేషన్‌ థియేటర్‌, కిచెన్‌ భవనాలను కూల్చివేస్తున్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న అధికారులు కొంతమేర బీటీ పనులు పూర్తి చేశారు. ఇప్పటికే మూసీ వరకు పనులు పూర్తి కాగా.. ఇక మూసీ నుంచి పీర్జాదిగూడ వరకు పనులు పూర్తి చేస్తే ఈ మార్గంలో రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఇతర కారిడార్ల విషయానికి వస్తే ఉప్పల్‌ ఆదిత్య వైద్యశాల నుంచి బోడుప్పల్‌, జేవీ హిల్స్‌ మదీనగూడ రోడ్లు ఇంకా పూర్తి కాలేదు. మిగిలిన రోడ్ల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న పనులు ఇవే..

* (కారిడార్‌ 99) 4.78 కిలోమీటర్లు .., మూసీ పై బ్రిడ్జి నిర్మాణం నాగోలు రేడియల్‌ రోడ్డు నుంచి వరంగల్‌ హైవేపై పీర్జాదిగూడ వరకు 

* లంగర్‌హౌజ్‌ మణికొండ కనెక్టివిటీ కోసం నెక్నాంపూర్‌ నుంచి హిమాయత్‌ సాగర్‌ రోడ్డు నిర్మాణం ( కారిడార్‌ 138)  460 మీటర్లు 

* మణికొండ నుంచి బోరబండ కనెక్టివిటీ అలకాపురి 100 ఫీట్‌ రోడ్‌ నుంచి సున్నం చెరువు పక్క నుంచి (కారిడార్‌ 66) 1 కిలో మీటర్‌ 

* వరంగల్‌ జాతీయ రహదారిపై ఉప్పల్‌ ఆదిత్యా దవాఖాన నుంచి నల్ల చెరువు పక్క నుంచి బోడుప్పల్‌ కలిపే రోడ్డు (కారిడార్‌ 86) ప్రారంభం కాలేదు. 2 కిలోమీటర్లు 

* జేవీ హిల్స్‌ పార్కు నుంచి మదీనగూడ రోడ్డు వరకు వయా ప్రభుప్రద లే అవుట్‌ (కారిడార్‌ 12) 1 కిలోమీటర్‌  ప్రారంభం కాలేదు. 

ప్రయాణికులకు దూర భారం తగ్గించేందుకే.. 


నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ చిక్కులను  పరిష్కరించడంతో పాటుగా దూరభారం తగ్గించాలనే ఉద్దేశంతో.. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు.. ప్రధాన ప్రాంతాలను కలుపుతూ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నాం. ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో హెచ్‌ఆర్‌డీసీ ద్వారా ప్రధానంగా రోడ్లను నిర్మిస్తున్నాం. ఇందూ అరణ్య నుంచి మూసీ మీదుగా పీర్జాదిగూడ వరకు 120 ఫీట్ల రోడ్డును వేయడం ద్వారా ఔటర్‌ రింగ్‌రోడ్డుకు, నాగోలు రేడియల్‌ రోడ్డు, వరంగల్‌ హైవేకు ప్రయాణం తేలిగ్గా మారుతున్నది. ఇతర మార్గాల్లో 100 ఫీట్ల రోడ్డును అభివృద్ధి చేస్తున్నాం. ఆదిత్యా దవాఖాన నుంచి బోడుప్పల్‌ రోడ్డు, జేవీ పార్కు నుంచి మజీద్‌ బండ రోడ్డు ఇంకా ప్రారంభం కాలేదు. మిగిలిన మూడు రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. 

- విజయ్‌కుమార్‌ 

( ఈఈ, హెచ్‌ఆర్‌డీసీ)